White Pumpkin Halwa : బూడిద గుమ్మడికాయలు అంటే సహజంగానే చాలా మంది ఇంటి ముందు దిష్టి కోసం కడుతుంటారు. కానీ ఆయుర్వేద పరంగా ఈ గుమ్మడికాయలతోనూ మనకు ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణ గుమ్మడికాయల్లాగే వీటిని కూడా తినవచ్చు. బూడిద గుమ్మడికాయలతో కూరలు చేసుకుని తింటుంటారు. అయితే వీటితో హల్వాను కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బూడిద గుమ్మడికాయ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు పూర్తిగా పిండేసిన బూడిద గుమ్మడికాయ తురుము – మూడు కప్పులు, గుమ్మడిరసం – ఒకటిన్నర కప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు, ఉప్పు – చిటికెడు, నిమ్మరసం – అర టీస్పూన్, నెయ్యి – పావు కప్పు, యాలకుల పొడి – ముప్పావు టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ పలుకులు – కొన్ని.
బూడిద గుమ్మడికాయ హల్వాను తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి అందులో గుమ్మడి రసం పోయాలి. అది మరుగుతున్నప్పుడు తురుము వేసి మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి నీళ్లు ఆవిరవుతాయి. ఇప్పుడు చక్కెర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ పలుకులు, యాలకుల పొడి వేసి అన్నింటినీ కలిపి దింపేయాలి. దీంతో ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతగానో ఇష్టపడతారు.