Karivepaku Kodi Masala Kura : మనం చికెన్ తో రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాలల్లో కరివేపాకు కోడి మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చేసుకోవడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే ఈ కరివేపాకు కోడి మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు కోడి మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు – 3 రెమ్మలు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, మిరియాల పొడి- అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పెరుగు -ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, నిమ్మరసం – ఒక నిమ్మకాయంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్.

కరివేపాకు కోడి మసాలా కూర తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత చికెన్ ను ఫ్రిజ్ లో ఉంచి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. గంట తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కోడి మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వివిధ రకాల రుచులను ట్రై చేయాలనుకునే వారు ఇలా కరివేపాకు కోడి మసాలా కూరను తయారు చేసుకుని తినవచ్చు.