Paneer Roll : మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో, రెస్టారెంట్ లలో లభించే వాటిల్లో పన్నీర్ రోల్స్ ఒకటి. పన్నీర్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. మనం పన్నీర్ రోల్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పన్నీర్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పన్నీర్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – అర టేబుల్ స్పూన్.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పన్నీర్ – 100గ్రా., పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, నూనె – అర టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – తగినన్ని, పొడుగ్గా తరిగిన క్యాప్సికం ముక్కలు – తగినన్ని, సన్నగా పొడుగ్గా తరిగిన టమాట ముక్కలు – తగినన్ని, స్ప్రింగ్ ఆనియన్స్ – తగినన్ని, టమాట సాస్ – కొద్దిగా, మయనీస్ – కొద్దిగా, క్యాబేజ్ తరుగు – కొద్దిగా.

పన్నీర్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకుని అందులో ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత దానిలో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి,. గరం మసాలా పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి.
తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించి చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని నుండి తగినంత పిండిని తీసుకుని చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీని నూనె వేసి చక్కగా కాల్చుకోవాలి. ఇలా అన్నీ చపాతీలను కాల్చుకున్న తరువాత ఒక చపాతీని తీసుకోవాలి. దాని మధ్యలో ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల మోతాదులో ఉంచాలి.
తరువాత దానిపై ఉల్లిపాయ ముక్కలను, టమాట ముక్కలను, క్యాప్సికం ముక్కలను ఉంచాలి. తరువాత వాటిపై చాట్ మసాలా, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లాలి. తరువాత టమాట సాస్, మయనీస్ వేయాలి. చివరగా క్యాబేజ్ తురుము వేసి చపాతీని గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే విధంగా ఉండే పన్నీర్ రోల్స్ తయారవుతాయి. లంచ్ బాక్స్ లోకి లేదా స్నాక్స్ గా వీటిని చేసుకుని తినవచ్చు. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు.