Stuffed Idli Recipe : ఎప్పుడూ రొటీన్‌గా చేసే ఇడ్లీల‌కు బ‌దులుగా ఇలా ఓసారి స్ట‌ఫ్డ్ ఇడ్లీలను చేసి చూడండి.. రుచి భ‌లేగా ఉంటాయి..

Stuffed Idli Recipe : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. నూనె ఎక్కువగా ఉప‌యోగించి చేసే అల్పాహారాల కంటే ఇడ్లీలు చాలా మేలైన‌వి. ఈ ఇడ్లీల‌ను కూడా మనం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ చేసే ఇడ్లీల కంటే కింద చెప్పిన విధంగా చేసే స్ట‌ప్ఫ్డ్ ఇడ్లీలు కూడా మ‌రింత రుచిగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ స్ట‌ప్ఫ్డ్ ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట‌ఫ్ఫ్డ్ ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

మిన‌ప‌గుళ్లు – 2 చిన్న గ్లాసులు, ఇడ్లీ ర‌వ్వు – 5 చిన్న గ్లాసులు, ఉప్పు – త‌గినంత‌, ఉడికించి మెత్త‌గా చేసిన బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Stuffed Idli Recipe in telugu make variety style
Stuffed Idli Recipe

స్ట‌ఫ్ఫ్డ్ ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మిన‌ప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో ఇడ్లీ ర‌వ్వ‌ను తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. ఇప్పుడు మిన‌ప‌ప్పును జార్ లో వేసి కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ర‌వ్వ‌ను చేత్తో పిండుతూ పిండిలో వేసి క‌లుపుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పిండిని 8 గంట‌ల పాటు లేదా ఒక రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి పులిసిన త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని అందులో ఉప్పును క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇందులోనే ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత మెత్త‌గా చేసుకున్న బంగాళ‌దుంప‌ల‌ను వేసి బాగా క‌ల‌పాలి. దీనిని మూడు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న బంగాళాదుంప మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ వ‌డ‌లుగా వ‌త్తుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర‌ను తీసుకుని అందులో నీటిని పోసి మూత పెట్టి నీటిని వేడి చేయాలి. త‌రువాత ఇడ్లీ ప్లేట్ ల‌ను తీసుకుని అందులో కొద్దిగా ఇడ్లీ పిండిని చేత్తో వేయాలి.

త‌రువాత ఆ పిండిపై బంగాళాదుంప మిశ్ర‌మంతో చేసిన వ‌డ‌ను ఉంచాలి. దానిపై మ‌రికొద్దిగా ఇడ్లీ పిండిని చేత్తో వేయాలి. ఇలా ఇడ్లీల‌ను వేసిన త‌రువాత ఇడ్లీ పాత్ర‌లో ఉంచి మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 20 నిమిషాల వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ ఇడ్లీల‌ను నెమ్మ‌దిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్ట‌ఫ్ఫ్డ్ ఇడ్లీ త‌యారవుతుంది. దీనిని సాంబార్, ప‌ల్లి చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాధార‌ణ ఇడ్లీల కంటే ఇలా చేసిన ఇడ్లీలు మ‌రింత రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీల‌ను కూడా అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts