Thotakura Curry : తోటకూర.. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో ఇది ఒకటి. తోటకూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వారానికి రెండు సార్లు తోటకూరను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. తోటకూరతో మనం ఎక్కువగా వేపుడు, పప్పు వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. కానీ తోటకూరతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూరతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని సులభంగా అలాగే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. తోటకూరతో రుచిగా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన తోటకూర – 4 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన టమాటాలు – 2, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2,దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఇంగువ – చిటికెడు.

తోటకూర కర్రీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో తోటకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేసుకోవాలి. తరువాత పావు గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. ఈ తోటకూరను మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి అందులో ఉప్పు, కారం, పసుపుచ చింతపండు రసం వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
తాళింపు వేగిన తరువాత ఉడికించుకున్న తోటకూర వేసి కలపాలి. దీనిని 8 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తోటకూరతో తరచూ చేసే వంటలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కర్రీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ కూరను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.