రసాయనాలతో పండించిన కూరగాయలను, ఆకుకూరలను తినలేకపోతున్నారా..? ఇంట్లో కూరగాయలను పండిద్దామంటే అందుకు తగిన స్థలం లేదా? స‌్వచ్ఛమైన, సహజ సిద్ధమైన పద్ధతుల్లో పండించిన వెజిటబుల్స్‌ను తినాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయేది మీకోసమే. ఇంట్లో ఎంత తక్కువ స్థలం ఉన్నా, కృత్రిమ ఎరువుల అవసరం లేకుండా, సహజ సిద్ధమైన పద్ధతిలో కూరగాయలను పండించుకోగలిగే ఓ ప్రత్యేకమైన విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదే హైడ్రోపోనిక్స్ (Hydroponics) విధానం. హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలను మట్టిలో పెంచడం ఉండదు. కేవలం వేళ్లు మాత్రమే నీటిలో ఉంటాయి. వాటికి కావల్సిన పోషకాలతో కూడిన నీటిని మారుస్తుండాలి. దీంతో మొక్కలు ఏపుగా పెరుగుతాయి. కానీ మొక్కలకు కావల్సిన సూర్య రశ్మిని మాత్రం అందిస్తుండాలి. ప్రస్తుతం చాలా మంది ఈ హైడ్రో పోనిక్స్ విధానంలో తమ ఇళ్లలోనే మొక్కలను పెంచుతున్నారు. ఇలా మొక్కలను పెంచేందుకు మట్టి అవసరం అసలు ఉండదు.
సాధారణంగా పండే పంటల కన్నా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పండే పంటలు 50 శాతం త్వరగా పెరుగుతాయట. దీనికి తోడు సంవత్సరం మొత్తం ఈ పంటలను పండిస్తూనే ఉండవచ్చట. మధ్యలో ఎలాంటి బ్రేక్ ఇవ్వాల్సిన పనిలేదట. కృత్రిమ ఎరువుల అవసరం ఉండదు కాబట్టి ఎంతో స్వచ్ఛమైన, సహజమైన పంట చేతికి వస్తుంది. ఇకపోతే ఈ సిస్టమ్‌లో వాడే మిశ్రమం మళ్లీ మళ్లీ ఉపయోగపడుతుంది కాబట్టి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుందట. అంతేకాదు, ఇంట్లో బాల్కనీ వంటి ప్రదేశం ఉన్నా ఈ తరహా సిస్టమ్ ద్వారా పంటలను సులభంగా తక్కువ ఖర్చుతోనే పండించవచ్చట. అయితే ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రీతిలో పోషణ అవసరం అవుతుంది కాబట్టి దాని కోసం వాడే మిశ్రమాన్ని మాత్రం మార్చాల్సి ఉంటుంది. కానీ ఆ మిశ్రమాన్ని ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు.
25 ఎంఎల్ కాల్షియం నైట్రేట్ (CaNO3), 1.7 ఎంఎల్ పొటాషియం సల్ఫేట్ (K2SO4), 8.3 ఎంఎల్ పొటాషియం నైట్రేట్ (KNO3), 6.25 ఎంఎల్ మోనో పొటాషియం పాస్ఫేట్ (KH2PO4), 17.5 ఎంఎల్ మెగ్నిషియం సల్ఫేట్ (MgSO4) లను 20 లీటర్ల ఫిల్టర్ నీటిలో కలపాలి. దీంతో మీకు కావల్సిన మిశ్రమం తయారవుతుంది. దీని ద్వారా నైట్రోజన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, సల్ఫర్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మాంగనీస్, జింక్, మాలిబ్డినం, బోరాన్ వంటి పోషకాలు మొక్కలకు సరిగ్గా అందుతాయి.
హైడ్రోపోనిక్స్ విధానంలో 3 రకాలుగా మొక్కలను పెంచవచ్చు. అందులో ఒకటి హైడ్రోపోనిక్ రాఫ్ట్. దీంట్లో మనకు కావల్సిన సైజుల్లో సిస్టమ్ లభిస్తుంది. రెండవది వెర్టికల్ హైడ్రోపోనిక్స్. ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్న వారికి ఇది పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇక మూడవది ఆక్వాపోనిక్స్. ఇది కూడా దాదాపుగా పై రెండు నిర్మాణాలను పోలి ఉంటుంది. తోటలో నిరుపయోగంగా ఉన్న ప్రదేశంలో దీన్ని సులభంగా అమర్చుకోవచ్చు. అయితే ఈ మూడింటిలో మనకు కావల్సిన హైడ్రోపోనిక్స్ సిస్టమ్‌ను ఎంచుకుని ఎంచక్కా కూరగాయలను సాగు చేయవచ్చు. దీంతో బెంబేలెత్తించే కూరగాయల ధరల బాధ మనకు తప్పుతుంది. అంతేగా మరి!