Usirikaya Nilva Pachadi : కాలానుగుణంగా లభించే వాటిల్లో ఉసిరికాయలు కూడా ఒకటి. చలికాలంలో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. ఉసిరికాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ ఉసిరికాయలను పులుపు రుచి కొరకు వంటల్లో ఉపయోగించడంతో పాటు వీటితో పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉసిరికాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు అలాగే మొదటిసారిగా తయారు చేసే వారు కూడా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలతో ఎంతో రుచిగాఉండే నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
రాచ ఉసిరికాయలు – కిలో ( నాలుగున్నర గ్లాసులు), నానబెట్టిన చింతపండు – 100 గ్రా., పల్లి నూనె – ఒకటిన్నర గ్లాస్ ( అరకిలో ), ఇంగువ – అర టీ స్పూన్, మెంతులు – 2 టీ స్పూన్స్, ఆవాలు – 4 టీ స్పూన్స్, కారం – ఒక గ్లాస్ ( 150 గ్రా.), ఉప్పు – అర గ్లాస్.

ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని తడి లేకుండా తుడిచి రెండు గంటల పాటు ఎండలో లేదా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తరువాత వీటికి చాకుతో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉసిరికాయలను వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఉసిరికాయలు వేగి రంగు మారిన తరువాత వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో మెంతులను, ఆవాలను వేసి దోరగా వేయించుకోవాలి.
తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత నానబెట్టిన చింతపండు నుండి గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల పల్లీ నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చింతపండు గుజ్జును వేసి ఉడికించాలి. చింతపండులోని నీరు అంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు వేయించిన ఉసిరికాయల్లో కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న ఆవపిండి, ఉడికించిన చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నూనె వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో, జాడీలో లేదా గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ పచ్చడిని మూడు రోజుల పాటు ఊరబెట్టాలి.
ఇలా ఊరబెట్టిన తరువాత పచ్చడిని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఈ పచ్చడి సంవత్సరం వరకు తాజాగా ఉంటుంది. ఈ విధంగా ఉసిరికాయలు దొరికే సమయంలో పచ్చడిని తయారు చేసి నిల్వ చేసుకుని తినవచ్చు.