Back Pain : నడుము నొప్పి.. మనలో ప్రతి ఒక్కరు ఈ సమస్య బారిన ఎప్పుడోకప్పుడో పడే ఉంటారు. ఈ సమస్య బారిన పడని వారు చాలా తక్కువగానే ఉంటారని చెప్పవచ్చు. జీవన విధానంలో, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. వయసు పెరిగిన వారిలో కనిపించే ఈ నడుము నొప్పి నేటి తరుణంలో యుక్త వయసులోని వారిలో కూడా కనబడుతుంది. స్త్రీ, పురుషులిద్దరూ ఈ సమస్య బారిన పడినప్పటికి స్త్రీలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు. ఈ సమస్య రావడానికి కారణాలు ఎన్ని ఉన్నప్పటికి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సాధారణ వ్యక్తుల్లో నడుము నొప్పి సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్స్ లోపించడం, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చోవడం, నిద్రించే పడక సరిగ్గా లేకపోవడం, ఎగుడు దిగుడు చెప్పులు వేసుకుని నడవడం వంటి తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది. అలాగే కండరాలు బలహీనంగా ఉండడం, స్పాంజీ లేదా దూది ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ద భంగిమల్లో కూర్చోవడం, నిలబడేటప్పుడు, కూర్చునేటప్పుడు సరైన భంగిమలను పాటించకపోవడం వంటి కారణాల చేత కూడా నడుము నొప్పి వస్తుంది. ప్రస్తుత కాలంలో కూర్చొని చేసే ఉద్యోగాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో నడుమునొప్పి తలెత్తుతుంది. అలాగే మానసిక ఒత్తిడి కారణంగా నడుము దగ్గర కండరాలు సంకోచిస్తాయి.

రక్తసరఫరా తగ్గవచ్చు. దీని వల్ల కూడా నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది. నడుము నొప్పి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పి నివారణకు యోగా, వ్యాయామం వంటివి బాగా ఉపయోగపడతాయి. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయాన్ని తగ్గించుకోవాలి. బరువు అధికంగా ఉన్నా కూడా వెన్ను మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే నొప్పి ఉన్న చోట వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. అలాగే స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చునేటప్పుడు సరైన భంగిమలను పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి. సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి వంగడం వంటివి చేయకూడదు.
సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవత్ర చాలా వరకు తగ్గుతుంది. కూర్చీలో కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. ముందుకు వాలినట్టు కూర్చోకూడదు. మోకాళ్లను సరైన దిశలో మల్చుకుని కూర్చోవాలి. కాలు పక్కకు వంచి కూర్చోకూడదు. అలాగే ఒకే దిశలో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకూడదు. మధ్యమధ్యలో కాస్త లేచి నడవడం చేయాలి. కంప్యూటర్ పై పని చేసేటప్పుడు కుర్చీ సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నడుము నొప్పితో బాధపడే వారు కుర్చీకి బదులుగా ఎక్ససైజ్ బాల్ ను ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ బాల్ ను ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. దీంతో తొడలు, పిక్కలు వంటి భాగాల్లో కొవ్వు సులభంగా కరుగుతుంది. ఈ చిట్కాలను పాటిస్తూ చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల నడుము నొప్పి తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.