Vellulli Karam Kodi Vepudu : చికెన్ తో మనం రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో కూరతో పాటు వేపుళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. వేయించిన చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ వేపుడును రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా వెల్లుల్లి కారాన్ని వేసి రుచిగా చికెన్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), తరిగిన టమాట – 1 ( మధ్యస్థంగా ఉన్నది), కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు – 10, దాల్చిన చెక్క – 1, లవంగాలు – 5, యాలకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – పావు టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్.
చికెన్ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాయ్యక శుభ్రంగా కడిగిన చికెన్ ను వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. చికెన్ లోని నీరు అంతా పోయి నూనె తేలే వరకు చికెన్ ను బాగా వేయించాలి. చికెన్ వేగుతుండగానే ఒక జార్ లో వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మరలా పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. చికెన్ వేగిన తరువాత అందులో వెల్లుల్లి కారాన్ని వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ 5 నుండి 6 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కారంగా, రుచిగా ఉండే చికెన్ వేపుడు తయారవుతుంది. దీనిని ఉల్లిపాయ. నిమ్మరసంతో కలిపి నేరుగా తినవచ్చు. పప్పు, సాంబార్ వంటి వాటితో కూడా ఈ చికెన్ వేపుడును తినవచ్చు. తరచూ చేసే చికెన్ వేపుడు కంటే ఇలా వెల్లుల్లి కారాన్ని వేసి చేసే చికెన్ వేపుడు మరింత రుచిగా ఉంటుంది. ఈ చికెన్ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.