Covid Cases Today : దేశంలో కరోనా విస్ఫోటనం చెందింది. ఒక్క రోజులోనే భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన మేరకు.. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. 327 మంది చనిపోయారు. ఈ క్రమంలోనే కోవిడ్ మూడో వేవ్ వచ్చినట్లే అని నిపుణులు వెల్లడిస్తున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 40,863కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరిగిపోతుండడంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే కఠిన ఆంక్షలను విధించి అమలు చేస్తున్నాయి. ఏపీలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. తెలంగాణలో ప్రస్తుతానికైతే కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు.
కాగా ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో వారాంతపు కర్ఫ్యూను విధించారు. తమిళనాడు ఆదివారాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలోనూ రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కాగా ఐఐటీ కాన్‌పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వేసిన అంచనాల ప్రకారం ఢిల్లీ, ముంబై వంటి పలు నగరాల్లో మరికొద్ది రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.