PUBG : పబ్‌జి మొబైల్ గేమ్ ఎంతటి వ్యసనంగా మారిందో అందరికీ తెలిసిందే. దీని బారిన పడి ఇప్పటికే పలువురు ప్రాణాలను పోగొట్టుకున్నారు. కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇది కలిగిస్తున్న అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ చాలా మంది ఈ గేమ్‌కు బానిసలుగా మారుతున్నారు. గేమ్ మాయలో పడి చుట్టూ అసలు ఏం జరుగుతుందో, తాము ఎక్కడ ఉన్నామో కూడా గమనించడం లేదు. దీంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రాజస్థాన్‌లోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో రూపబాస్‌టౌన్ సమీపంలో లోకేష్ మీనా (22), రాహుల్ (19) అనే ఇద్దరు అన్నదమ్ములు రైలు పట్టాలపై కూర్చుని పబ్‌జి గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్‌లో వారు లీనమైపోయారు. దీంతో పట్టాలపై వస్తున్న రైలును వారు గమనించలేదు. ఈ క్రమంలో వారి మీద నుంచి రైలు దూసుకెళ్లగా.. వారు అక్కడికక్కడే చనిపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లోకేష్, రాహుల్ ఇద్దరూ అన్నదమ్ములు కాగా వారు తమ అక్క వద్ద రూప్‌బాస్ టౌన్‌లో ఉంటూ కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఇంతలోనే ఇంతటి దారుణం చోటు చేసుకుంది. వారి తండ్రి అల్వార్ జిల్లాలోని టెహ్లా సమీపంలో ఓ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కాగా ఆ ఇద్దరు అన్నదమ్ములు పబ్‌జి గేమ్‌లో లీనమై ఎదురుగా వస్తున్న ట్రెయిన్‌ను చూసుకోలేదని.. దీంతోనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.