Curd : మనం ప్రతి రోజూ ఆహారంలో భాగంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరికి పెరుగుతో తిననిదే భోజనం చేసినట్టు ఉండదు. కొందరికి ఎన్ని రకాల కూరలు, పచ్చళ్లు ఉన్నప్పటికీ భోజనంలో పెరుగు తప్పకుండా ఉండాల్సిందే. పెరుగును ఎలా తిన్నా కూడా కచ్చితంగా రోజుకు రెండు సార్లు తినాల్సిందేనని పోషకార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి అన్ని రకాల పోషకాలతోపాటు శరీరానికి మేలు చేసే లాక్టో బెసిల్లస్ వంటి బాక్టీరియాలు కూడా పెరుగులో ఉంటాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
పుల్లని పెరుగును అరటి పండుతో కలిపి తినడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. పుల్లని పెరుగును మజ్జిగలా చేసి అందులో జీలకర్రను, కరివేపాకును, చిటికెడు శొంఠిని కలిపి తాగితే వాంతులు, డయేరియా తగ్గుతాయి. క్రమం తప్పకుండా పెరుగును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగుకు మన శరీరంలో జీవక్రియల రేటును పెంచే శక్తి ఉంది. దీనిని మూడు పూటలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరుగు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.
ఒక కప్పు పెరుగులో ఒక టీస్పూన్ నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవడమే కాకుండా నిగారింపును సొంతం చేసుకుంటుంది. పెరుగును ప్రతిరోజూ తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. మలబద్దకం, డయేరియా, మొలలు, పెద్ద పేగు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పెరుగు ఉపయోగపడుతుంది. పెరుగును తినడం వల్ల పొట్టలో, ప్రేగులలో ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. అసిడిటీతో బాధపడే వారు పాలను తాగడానికి బదులుగా పెరుగును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిల్లలకు దీనిని ప్రతిరోజూ ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. తరుచూ ఈస్ట్ సంబంధిత ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు పెరుగును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాయామం చేసిన తరువాత ఒక కప్పు పెరుగును తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజుకు కనీసం 50 గ్రాముల పెరుగును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.