Ice Apple : వేసవి కాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. తరువాత పుచ్చకాయలు, కీరా, తర్బూజా వంటివి కూడా గుర్తుకు వస్తాయి. ఈ సీజన్‌లో వీటిని ఎక్కువగా తింటుంటారు. ఇవన్నీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అయితే వేసవి సీజన్‌లో మనకు లభించే ఇతర పండ్లు కూడా ఉన్నాయి. వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి అని చెప్పవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ సీజన్‌లోనే లభించే తాటి ముంజలను తినడం వల్ల ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేసవిలో మన శరీరం సహజంగానే వేడిగా మారుతుంది. దీంతో వేడిదనం తగ్గించేందుకు శరీరం నీటిని బయటకు చెమట రూపంలో ఎక్కువగా పంపిస్తుంది. దీంతో శరీరం చల్లబడుతుంది. అయితే వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది కనుక చెమట కూడా ఎక్కువగానే వస్తుంది. దీంతో శరీరంలో ఉండే నీరంతా త్వరగా అయిపోతుంటుంది. కనుక మనం పదే పదే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే తాటి ముంజలను తిన్నా కూడా శరీరానికి నీరు బాగానే లభిస్తుంది. దీంతో శరీరం చల్లగా ఉంటుంది. వేసవి తాపం, ఎండ దెబ్బ బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు. కనుక ఈ సీజన్‌లో తప్పకుండా తాటి ముంజలను తినాల్సిందే.
2. తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక ముంజలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా సీజనల్ దగ్గు, జలుబు నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.
3. తాటి ముంజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఇది అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడుతుంది. అలాగే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, కడుపులో మంట నుంచి బయట పడవచ్చు.
4. తాటి ముంజలను తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. అలాగే చర్మంపై వచ్చే దురదలు, దద్దుర్లు కూడా తగ్గుతాయి.
5. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ ముంజలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. బిడ్డకు కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అలాగే వికారం, తలతిరగడం, వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి.
6. తాటి ముంజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే లివర్‌ను శుభ్ర పరుస్తుంది. లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.