Jowar Idli : మనకు అందుబాటులో ఉండే చిరు ధాన్యాలలో జొన్నలు ఒకటి. ఐరన్, కాల్షియం, విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ వంటి పోషకాలు జొన్నలలో అధికంగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలను జొన్నలు నియంత్రణలో ఉంచుతాయి. కనుక డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు కూడా జొన్నలను తినవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్త నాళాల్లో హెచ్‌డీఎల్(మంచి కొలెస్ట్రాల్) లెవల్స్ ను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో జొన్నలు సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా జొన్నలు ఎంతో ఉపయోగపడతాయి. జొన్నలతో చేసే వంటకాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జొన్న రొట్టెలు. కానీ వీటిని తయారు చేయడం అందరికీ రాదు. అలాగే శ్రమతో కూడుకున్న పని. కనుక సులువుగా, తక్కువ శ్రమతో జొన్నలతో చేసే వంటకం ఏదైనా ఉంది అంటే.. అవి జొన్న ఇడ్లీలు. వీటిని ఎంతో సులభంగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు జొన్న ఇడ్లీలు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.
జొన్న ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, జొన్న రవ్వ – రెండు కప్పులు, ఉప్పు – తగినంత.
జొన్న ఇడ్లీ తయారు చేసుకునే విధానం..
మొదటగా మినపప్పును కడిగి 5 నుండి 6 గంటల వరకు నానబెట్టాలి. ఇప్పుడు జొన్న రవ్వను రెండు సార్లు కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఈ జొన్న రవ్వలో ఒక అరకప్పు నీళ్లు పోసి 6 నుండి 7 గంటల వరకు నానబెట్టాలి. ఇప్పుడు మినపప్పును జార్ లో వేసి మెత్తగా పిండి చేయాలి. ఈ పిండిని నానబెట్టిన జొన్నరవ్వలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 నుండి 9 గంటల వరకు పులియబెట్టాలి. తరువాత ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీ పాత్రలో వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తటి జొన్న ఇడ్లీలు తయారవుతాయి. వీటిని పల్లీలు లేదా కొబ్బరి చట్నీలతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
జొన్నలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. రోజంతా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. కనుక జొన్న ఇడ్లీలను తినవచ్చు. దీంతో పోషకాలు కూడా లభిస్తాయి. అధిక బరువు తగ్గుతారు. ఇంకా జొన్నల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జొన్న రొట్టెలను చేసుకుని తినలేని వారు ఇలా జొన్న ఇడ్లీలను సులభంగా తయారు చేసి తినవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.