Black Cardamom : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో నల్ల యాలకులు కూడా ఒకటి. వీటిని బడీ ఇలాచీ అని కూడా అంటారు. మసాలా వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాలకులు నల్లగా చక్కటి వాసనను కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యాలకులను ఉపయోగించడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సాధారణ యాలకుల వలె నల్ల యాలకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. నల్ల యాలకులను వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
నల్ల యాలకులను వాడడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల యాలకులను ఉపయోగించడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అలాగే వీటిని వాడడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. దగ్గు, బ్రాంకైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ నల్ల యాలకులను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
శరీరంలో ఉండే నొప్పులు, వాపులను తగ్గించడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. అంతేకాకుండా నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేయడంలో దోహదపడతాయి. ఈ యాలకులను వాడడం వల్ల గుండె జబ్బులు, క్యాన్స్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా నల్ల యాలకులను ఉపయోగించడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. ఈ యాలకుల్లో యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నశింపజేసి నోటి ఇన్ఫెక్షన్ లను, దంతాలు పుచ్చిపోవడాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
ఈ యాలకులను వాడడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. అంతేకాకుండా ఈ యాలకులను వాడడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుండి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ యాలకులు శరీరంలో ఉండే రక్తనాళాలను వ్యాకోచించేలా చేసి రక్తప్రవాహాన్ని మెరుగపరుస్తాయి. తద్వారా రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా నల్ల యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అయితే ఇవి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి కనుక వీటిని తక్కువ మోతాదులో వాడుకోవాలని అప్పుడే మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.