భారతీయుల్లో దాదాపుగా 50 శాతం మందికి పైగా నిత్యం భోజనంలో అన్నమే తింటారు. అయితే అన్నం తెల్లగా ముత్యాల్లా ఉంటే గానే కొందరు తినరు. కానీ నిజానికి ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల తెల్ల బియ్యం వస్తుంది. అయితే పాలిష్ చేస్తే ముడి బియ్యంపై ఉండే పొర పోతుంది. అందులో ఉండే ముఖ్యమైన పోషకాలు కూడా పోతాయి. అవేవీ మనకు అందవు. కనుక పాలిష్ చేయని బియ్యాన్ని తినాలి. ఈ క్రమంలోనే ముడి బియ్యం (బ్రౌన్ రైస్)ను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డయాబెటిస్
పాలిష్ చేసిన బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే దాంతో వండిన అన్నాన్ని తింటే మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరుగుతాయి. కానీ బ్రౌన్ రైస్ గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. దీంతో వండిన అన్నాన్ని తినడం వల్ల షుగర్ స్థాయిలు వెంటనే పెరగవు. అందువల్ల బ్రౌన్ రైస్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే డయాబెటిస్ లేని వారు కూడా బ్రౌన్ రైస్‌ను నిత్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
2. కొలెస్ట్రాల్
బ్రౌన్ రైస్‌లో గామా-అమైనోబ్యుటీరిక్ యాసిడ్ (జీఏబీఏ) అనబడే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. నిత్యం బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
3. అధిక బరువు
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. అందువల్ల బ్రౌన్ రైస్‌ను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో అధిక బరువు తగ్గవచ్చు.
4. గుండె ఆరోగ్యం
బ్రౌన్ రైస్ ను నిత్యం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని, రక్త నాళాలు సురక్షితంగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. బ్రౌన్ రైస్‌లో ఉండే విటమిన్ బి1, మెగ్నిషియంలు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి.
5. క్యాన్సర్
బ్రౌన్ రైస్‌లో ఐనాసిటాల్ హెగ్జాఫాస్ఫేట్ (ఐపీ6) అనబడే సహజసిద్ధమైన సమ్మేళనం ఉంటుంది. దీన్ని వక్షోజ, లివర్, పెద్ద పేగు, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల వక్షోజ, పేగుల క్యాన్సర్లు రాకుండా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. బ్రౌన్ రైస్‌లో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి.