Camphor : కర్పూరం.. ఇది మనందరికీ తెలుసు. కర్పూరం తెలుపు రంగులో చక్కని వాసనను కలిగి ఉంటుంది. మనకు హారతి కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు రకాల కర్పూరాలు దొరుకుతాయి. ప్రస్తుత కాలంలో హారతి కర్పూరాన్ని కొన్ని రకాల రసాయనాలతో తయారు చేస్తున్నారు. కర్పూరాన్ని చెట్టు నుండి తయారు చేస్తారు. పచ్చ కర్పూరాన్ని తీపి పదార్థాల తయారీలో, ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. పచ్చ కర్పూరంలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో పచ్చ కర్పూరం ఎంతగానో సహాయపడుతుంది.
విష జ్వరాలను, మూత్రంలో మంటను, ముక్కు దిబ్బడను, శరీరం నుండి వచ్చే దుర్వాసనను, చర్మ సంబంధిత సమస్యలను, వ్రణాలతోపాటు అనేక వ్యాధులను హరించడంలో పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేద షాపుల్లో మనకు కర్పూర తైలం కూడా లభిస్తుంది. ఈ తైలాన్ని ఉపయోగించడం వల్ల కూడా మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. కర్పూర తైలాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పచ్చ కర్పూరం యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇనుప వస్తువుల కారణంగా తగిలే గాయాలపై పచ్చ కర్పూరాన్ని, నెయ్యిని కలిపి రాసి కట్టు కట్టడం వల్ల గాయాలు చీము పట్టకుండా త్వరగా మానిపోతాయి.

పచ్చకర్పూరాన్ని , మర్రి పాలను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకుని రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లకు కాటుకలా పెట్టుకోవడం వల్ల కంటి పూలు తగ్గిపోతాయి. పచ్చ కర్పూరాన్ని, పొగాకును, సీతాఫలం ఆకులను సమపాళ్లల్లో తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కుళ్లిన వ్రణాలపై ఉంచి కట్టుకట్టడం వల్ల వ్రణాలు త్వరగా తగ్గుతాయి. వరి పొట్టును తీసుకుని కాల్చి బూడిద చేసి ఈ బూడిదను జల్లించాలి. దీనికి నాలుగో వంతు పచ్చ కర్పూరాన్ని కలిపి మెత్తగా నూరగా వచ్చిన మిశ్రమాన్ని నిల్వ చేసుకోవాలి. రోజూ ఉదయం ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రపరుచుకోవడం వల్ల దంతాల సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
హారతి కర్పూరాన్ని, తేనెను కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి లేపనంగా రాసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా రెండు రకాల కర్పూరాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన, ఎటువంటి రసాయనాలను వాడని కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.