Rose Flowers : చూడగానే చక్కని అందంతో, సువాసనతో ఎవరినైనా ఆకట్టుకునే పువ్వుల్లో గులాబీ పువ్వు కూడా ఒకటి. వివిధ రంగుల్లో ఉండే గులాబీ పువ్వులు మనకు లభిస్తాయి. ఈ గులాబీ చెట్లను మన ఇంటి ఆవరణలో సులువుగా పెంచుకోవచ్చు. గులాబీ పువ్వులను కేవలం అలంకరణ కోసమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. గులాబీ పువ్వుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని సంస్కృతంలో శతపత్రి, సౌమ్య గంధ అని పిలుస్తారు. మనకు దేశవాళీ గులాబీలు, హైబ్రిడ్ గులాబీలు అనే రెండు రకాల గులాబీ చెట్లు లభిస్తాయి.
మన ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో మనకు దేశవాళీ గులాబీలు మాత్రమే ఉపయోగపడతాయి. గులాబీ పూల కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. గుండె బలంగా తయారవుతుంది. ఈ కషాయం పొట్టలోని చెడు వాయువులను, పైత్యాన్ని, కఫాన్ని హరించి వేస్తుంది. గులాబీ పువ్వులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో మనం చాలా కాలం నుండి గులాబీ నీటిని ఉపయోగిస్తూనే ఉన్నాం. గులాబీ నీటిని, గ్లిసరిన్ ను, ఏడు సార్లు వడబోసిన నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది చుక్కల మోతాదులో తీసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి సున్నితంగా రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై వచ్చే మచ్చలు, ముడతలు, మొటిమలు, మంగు మచ్చలు అన్నీ పోయి ముఖం మృదువుగా, కాంతివంతగా తయారవుతుంది.
గులాబీ పువ్వుల నుండి నూనెను కూడా తయారు చేస్తారు. ఆయుర్వేద షాపుల్లో మనకు ఈ తైలం లభిస్తుంది. ఈ తైలాన్ని పైన లేపనంగా రాసి మర్దనా చేయడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. గులాబీ రేకుల పొడి, సునాముఖి ఆకుల పొడి, దోరగా వేయించిన శొంఠి పొడి, దోరగా వేయించిన మిరియాల పొడి, నేల వేము పొడి, నీడలో ఆరబెట్టి దంచిన వేప లేత ఆకుల పొడి.. వీటన్నింటనీ సమభాగాలుగా తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి అర కప్పు అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ నీటిని రోజుకు రెండు పూటలా వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల సమస్త జ్వరాలు తగ్గిపోతాయి.
60 గ్రాముల ఎండిన గులాబీ రేకులను 2 లీటర్ల నీటిలో వేసి చిన్న మంటపై ఒక లీటర్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ నీటిని మరలా స్టవ్ మీద ఉంచి వాటిలో 200 గ్రాముల పటిక బెల్లాన్ని వేసి పాకం వచ్చే వరకు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని మూడు పూటలా ఒక టీ స్పూన్ మోతాదులో ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి కాలేయానికి బలం చేకూరుతుంది. గులాబీ రేకుల పొడి 50 గ్రాములు, సునాముఖి పొడి 50 గ్రాములు, దోరగా వేయించిన శొంఠి పొడి 50 గ్రాములు, సైంధవ లవణం 50 గ్రాముల మోతాదులో తీసుకుని వీటన్నింటనీని రోట్లో వేయాలి. ఇందులోనే తగినంత తేనెను కలిపి ముద్దగా నూరాలి. ఈ లేహ్యాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకుని రోజూ రాత్రి తింటూ ఉంటే అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
5 గ్రాముల గులాబీ రేకుల పొడిని, 5 గ్రాముల కండచక్కెర పొడిని కలిపి రెండు పూటలా మంచి నీటితో తింటూ ఉంటే 20 నుండి 40 రోజుల్లో పురుషుల్లో వచ్చే స్వప్న స్కలనం సమస్య తగ్గుతుంది. ఈ విధంగా గులాబీ పువ్వులను ఉపయోగించడం వల్ల మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.