హెల్త్ టిప్స్

చిరుధాన్యాలతో గుండె ఆరోగ్యం పదిలం..!!

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు.. వీటిని చిరు ధాన్యాలు అంటారు. వీటినే తృణ ధాన్యాలు అని, సిరి ధాన్యాలు అనీ, ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అని అంటారు. పోషకాలను బట్టి ముతక ధాన్యాల్లోని రకాలైన జొన్నలను కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు.

chiru dhanyalatho gunde arogyam padilam

ఒకప్పుడు మనిషి చిరు ధాన్యాలనే ఎక్కువగా సాగు చేసేవాడు. కానీ ఆ తరువాత కాలం మారింది. అయితే ఆరోగ్యం దృష్ట్యా మళ్లీ వీటిని పండించడం ఎక్కువైంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వీటిని బాగా పండిస్తున్నారు. బియ్యం, గోధుమలకు బదులుగా వీటిని తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిరు ధాన్యాలను తింటున్న వారి సంఖ్య ప్రస్తుతం క్రమేపీ పెరుగుతోంది.

బాగా పాలిష్‌ చేసిన బియ్యాన్ని తింటే బరువు పెరుగుతారు. డయాబెటిస్‌ వస్తుంది. కానీ చిరు ధాన్యాలను తినడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇప్పటికే ఆయా సమస్యలతో బాధపడుతున్న వారు రోజూ వాటిని తింటే ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది. అందుకనే మిల్లెట్ల వాడకం పెరిగింది. వీటిని రోజు వారీ ఆహారంలో ఎక్కువగా తీసుకుంటున్నారు.

మిల్లెట్స్‌లలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో అవసరం. అలాగే వీటిల్లో ప్రోటీన్లు సమృద్ధిగానే ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందిస్తాయి. సమతుల ఆహారంగా పనిచేస్తాయి. అందువల్ల చిరు ధాన్యాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. చిరుధాన్యాలన్నింటిలోనూ విటమిన్‌ బి, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నిషియం, జింక్‌ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

రాగుల ద్వారా మనకు కాల్షియం అధికంగా లభిస్తుంది. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. చిరుధాన్యాల్లో అధికంగా ఉండే మెగ్నిషియం డయాబెటిస్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కొర్రల వల్ల మధుమేహం తగ్గుతుంది. ట్రై గ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పీచు ఎక్కువగా ఉండడం వల్ల చిరు ధాన్యాల్లోని పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. గ్లూకోజ్‌ రక్తంలోకి నెమ్మదిగా విడుదల అవుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. చిరుధాన్యాల్లో అధికంగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే పొట్ట నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. దీంతో అతిగా తినే ప్రమాదమూ తప్పుతుంది. ఈ క్రమంలో బరువు తగ్గడం తేలికవుతుంది.

చిరు ధాన్యాల్లో ఉండే పీచు వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవు. వీటిల్లో ఫైటేట్స్‌, టానిన్స్‌ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌, మధుమేహం సమస్యలను తగ్గిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా అరికెలను వాడుతారు. చిరుధాన్యాల్లో ఉండే ఫైటేట్స్‌ మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. క్యాన్సర్లు, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. అసిడిటీ సమస్యతో బాధపడేవారు చిరు ధాన్యాలను తింటే ఎంతో హితకరంగా ఉంటుంది.

మెనోపాజ్‌ దాటిన మహిళలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు ఆహారంలో చిరు ధాన్యాలను తీసుకోవాలి. చిరుధాన్యాలను మొలకెత్తించి వాటిని ఎండబెట్టి పిండి చేయాలి. దాన్ని చిన్నారులకు తినిపిస్తే ఎంతో బలం కలుగుతుంది. ఆ పిండిని పాలిచ్చే తల్లులు, వృద్ధులు తినవచ్చు. వారు ఆరోగ్యంగా ఉంటారు.

కొర్రలయినా, సజ్జలయినా అన్నం వండాలంటే తీసుకున్న ధాన్యానికి సుమారుగా మూడు రెట్లు ఎక్కువగా నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం రూపంలోనే తీసుకోవాల్సిన పనిలేదు. పిండి లేదా రవ్వగా తయారు చేసుకుని తినవచ్చు. లేదా ఉప్మా, దోశ, ఇడ్లీ, వడ, బజ్జీ, అట్లు, పొంగల్‌, కిచిడీ, బిర్యానీ, పాయసం, రొట్టె ఇలా ఏ రూపంలో అయినా చిరుధాన్యాలను తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts