Cooking Vessels : మనం వంటింట్లో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తయారు చేయడానికి రకరకాల పాత్రలను ఉపయోగిస్తూ ఉంటాము. పూర్వకాలంలో కేవలం మట్టి పాత్రలనే వాడే వారు. వీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని కలగదు. కానీ నేటి తరుణంలో మట్టి పాత్రల వాడకమే తగ్గిపోయింది. వాటికి బదులుగా స్టీల్, అల్యూమినియం, నాన్ స్టిక్ పాత్రలను వాడుతున్నారు. వీటిని వాడడం సులభంగా ఉండడంతో పాటు సులవుగా శుభ్రం చేసుకోవచ్చు. దీంతో అందరూ వీటినే ఎక్కువగా వాడుతున్నారు. వంట చేయడానికి వివిధ రకాల పాత్రలను వాడినప్పటికి మనలో చాలా మందికి వంట చేయడానికి ఏ పాత్రలు మంచివి అనే సందేహం కలుగుతుంది. వంట చేయడానికి అల్యూమినియం కంటే స్టీల్ మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
అల్యూమినియం పాత్రలో వంటలు చేయడం అందులో వేసే పులుపు, పెరుగు, వంటి వాటి వల్ల చర్యలు జరిగి కొంత మోతాదులో అల్యూమినియం వంటల్లో కలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా సంవత్సరాల తరబడి అల్యూమినియం పాత్రలను వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం కంటే స్టీల్ పాత్రలు వేడిని ఎక్కువగా తట్టుకుంటాయి. స్టీల్ త్వరగా కరిగి వంటల్లో కలవదని వారు చెబుతున్నారు. ఒకవేళ అల్యూమినియం పాత్రలను వాడాల్సి వస్తే వాటిలో వంట వండి వెంటనే వాటిని వేరే గిన్నెలో వేసుకోవాలి. వాటిని అదే అల్యూమినియం పాత్రలో ఉంచి మరలా మరలా వేడి చేయకూడదు. ముఖ్యంగా పులుసు, చారు వంటి వాటిని అల్యూమినియం పాత్రలల్లో ఎక్కువ సమయం వరకు అస్సలు ఉంచకూడదు. వీటిలో ఉండే పులుపు కారణంగా రసాయన చర్యలు ఎక్కువగా జరిగి మనకు మరింత హాని కలిగే అవకాశం ఉంది.
కనుక వీలైన వారు అల్యూమినియం కంటే స్టీల్ పాత్రలను వాడడమే మంచిదని వారు చెబుతున్నారు. మందపాటి స్టెయిన్ స్టీల్ పాత్రలను ఉపయోగించడం వల్ల హాని కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే స్టీల్ పాత్రలల్లో వంటలు వండేటప్పుడు అడుగు అంటుకుపోకుండా జాగ్రత్తగా దగ్గర ఉండి వండుకోవాలి. లేదంటే అడుగును మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నాన్ స్టిక్ పాత్రల విషయానికి వస్తే ఇవి వండుకోవడానికి మరింత వీలుగా ఉంటాయి. తక్కువ నూనెతో వీటిలో వంటకాలు తయారు చేసుకోవచ్చు. అయితే నాన్ స్టిక్ ను వాడడం వల్ల వీటిపై ఉండే టెప్లాన్ కోటింగ్ కరిగి వంటల్లో కలుస్తుంది కనుక వీటిని వాడడం కూడా మంచిది కాదని చాలా మంది చెబుతూ ఉంటాయి. నాన్ స్టిక్ పాత్రల్లో ఉండే టెప్లాన్ 100 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలదని అంత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్దే టెప్లాన్ కరిగి వంటల్లో కలుస్తుందని కనుక మనం చేసే సాధారణ వంటలకు నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వంటలు వండుకోవడం మంచిదని వారు చెబుతున్నారు.