Diabetes Foods To Avoid : ప్రస్తుత కాలంలో మనల్ని వేదిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. షుగర్ వ్యాధి బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు ప్రణాళిక బద్దమైన ఆహార నియమాలను కలిగి ఉండాలి. అలాగే ఎక్కువ చక్కెర ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఆహార పదార్థాలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు హానిని కలిగిస్తాయి. ఆ ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు దూరంగా ఉంచాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కుక్కీస్, క్యాండీస్, సోడా, కృత్రిమంగా తయారు చేసే పదార్థాలు ఎక్కువ పోషకాలను కలిగి ఉండవు. ఇవి తక్కువ నాణ్యత కలిగిన కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెంచుతాయి. కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచి డయాబెటిస్ ను తీవ్రతరం చేస్తాయి. చక్కెర పదార్థాలను తినాలని కోరికగా ఉంటే నాణ్యత గల లేదా మంచి రకం కార్బోహైడ్రేట్స్ ఉన్న తాజా పండ్లను తినాలి. ఆపిల్, ద్రాక్ష, నారింజ, బెర్రీ వంటి వాటిలో ఫైబర్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా ఫైబర్ కలిగిన పండ్లు గ్లూకోజ్ ను ఆలస్యంగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతాయి. ఈ పండ్లను పెరుగులో లేదా కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కలిపి తినవచ్చు.
ఇక డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు తక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో డైరీ ప్రొడక్ట్స్ ఒకటి. షుగర్ వ్యాధి గ్రస్తులు స్యాచురేటెడ్ ప్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఒక శాతం కంటే తక్కువ ఫ్యాట్ ఉన్న పాల పదార్థాలు లేదా హోల్ మిల్క్ పదార్థాలను తక్కువగా తీసుకోవడం లేదా మానేయడం మంచిది. అలాగే ఎండుద్రాక్షలు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతాయి. ద్రాక్షలో ఉండే చక్కెరలను శరీరం గ్రహించుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఎండుద్రాక్షకు బదులుగా తాజా ద్రాక్ష, స్ట్రాబెర్రీ, తాజా పీచ్ వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ పాస్తా వంటివి ఎక్కువగా శుద్ధి చేయబడిన పిండి పదార్థాలను కలిగి ఉంటాయి.
ఈ రకమైన ఆహార పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిల్లో మార్పులను కలిగిస్తాయి. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి. వేయించిన ప్రెంచ్ ఫ్రైస్, డోనట్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా షుగర్ వ్యాధి కూడా నియంత్రణలో ఉండదు. వీటిలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి హానిని కలిగిస్తాయి. వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా క్యాలరీలను కలిగి ఉంటాయి. ఈ క్యాలరీలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ ఆహార పదార్థాలకు బదులుగా అధికంగా ఫైబర్ ఉండే చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం కూడా అదుపులో ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.