Ravva Laddu : చాలా త్వరగా చేసుకోదగిన తీపి పదార్థాల్లో రవ్వ లడ్డూలు కూడా ఒకటి. బొంబాయి రవ్వతో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. అయితే కొందరూ ఎందరూ ప్రయత్నించిన ఈ లడ్డూలను మెత్తగా తయారు చేసుకోలేకపోతుంటారు. అలాగే కొందరు చేసిన లడ్డూలు త్వరగా పాడైపోతుంటాయి. రుచిగా, మెత్తగా, చాలా కాలం నిల్వ ఉండేలా రవ్వ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డు తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, నెయ్యి – పావు కప్పు, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, పంచదార – ముప్పావు కప్పు లేదా ఒక కప్పు, కాచిచల్లార్చిన పాలు – 1/3 కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
రవ్వ లడ్డు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక బొంబాయి రవ్వను వేసి వేయించాలి. తరువాత ఎండు కొబ్బరి పొడిఏని కూడా వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. రవ్వ వేగిన తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత పాలను పోసి పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వను పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. ఆరిన తరువాత రవ్వ గట్టిగా తయారవుతుంది. ఈ రవ్వను చేత్తో నలిపి జార్ లోకి తీసుకోవాలి. దీనిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత అందులో వేయించిన డ్రైఫ్రూట్స్ ను వేసి కలపాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోస్తూ తగిన పరిమాణంలో రవ్వను తీసుకుంటూ లడ్డూల ఆకారంలో చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మృదువుగా, మెత్తగా, రుచిగా ఉండే రవ్వలడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజులకు పైగా తాజాగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా బొంబాయి రవ్వతో లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. ఇలా చేసిన రవ్వలడ్డూలు అందరూ ఇష్టంగా తింటారు.