Sprouts : ఎంతో కాలంగా మనం మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటూ ఉంటున్నాము. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. వైద్యులు కూడా మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఈ మొలకెత్తిన గింజల వల్ల మనకు కలిగే లాభాలేమిటి.. వీటిని ఎవరు తీసుకోవాలి.. ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం వివిధ రకాల గింజలను మొలకెత్తించి తీసుకుంటూ ఉంటాము. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
మొలకెత్తిన గింజలల్లో పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, ఫైబర్, రైబోప్లేవిన్, ప్రోటీన్, విటమిన్ బి6, థయామిన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మొలకెత్తించిన గింజలను తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ధృడంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణాశయంలో కదలికలు పెరుగుతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. బరువు తగ్గాలనుకునే వారు మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.
దీంతో మనం ఇతర ఆహారాల జోలికి వెళ్లకుండా ఉండవచ్చు. అలాగే వీటిలో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కనుక మనం వేగంగా బరువు తగ్గవచ్చు. మొలకెత్తిన గింజలల్లో అధికంగా ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీంతో మనం ఇన్ఫెక్షన్స్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొలకెత్తిన గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ విధంగా మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే మనం నాణ్యమైన గింజలను సేకరించి వాటిని మాత్రమే మొలకెత్తించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నాణ్యత తక్కువగా ఉండే గింజల్లో సాల్మనెల్లా, ఇ కోలై వంటి బ్యాక్టీరియాలు ఉండే అవకాశాలు ఉంటాయి. వీటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియాలు మన శరీరంలో అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కనుక శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు వీటిని ఉడికించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.