సాధారణంగా మనలో చాలా మంది ఒక్కసారి వండిన ఆహార పదార్థాలు మిగిలిపోతే వాటిని ఇంకో పూట తింటారు. కానీ వాటిని మరోసారి వేడి చేసుకుని మరీ తింటారు. అయితే కొన్ని పదార్థాలను వేడి చేసినా ఫర్వాలేదు. కానీ కొన్నింటిని మాత్రం మళ్లీ మళ్లీ వేడి చేయరాదు. అలా వేడి చేస్తే వాటిల్లో హానికర సమ్మేళనాలు ఏర్పడుతాయి. అవి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
కోడిగుడ్లను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని ఒక్కసారి ఏ రూపంలో అయినా వండితే వాటిని అప్పుడే తినేయాలి. మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినరాదు. ఎందుకంటే గుడ్లలో ఉండే ప్రోటీన్లు మన శరీరంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. కడుపు నొప్పిని కలిగిస్తాయి. కనుక గుడ్లను ఒక్కసారి వండితే వాటిని అప్పుడే తినేయాలి. మళ్లీ వేడి చేసి తినరాదు.
కోడిగుడ్ల లాగే చికెన్‌లోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల చికెన్‌ను వండితే ఒకేసారి తినాలి. దాన్ని మళ్లీ వేడి చేసి తినరాదు.
ఆలుగడ్డలను ఒక్కసారి వండాక మళ్లీ ఆ పదార్థాలను వేడి చేస్తే వాటిల్లో హానికారక బాక్టీరియా ఏర్పడుతుంది. అది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఆలుగడ్డలతో చేసే వంటలను మళ్లీ వేడి చేయరాదు.
పుట్ట గొడుగులను తాజాగా వండుకుని అప్పటికప్పుడే తినేయాలి. వీటితో చేసే వంటలను వేడి చేసి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాలు పడుతాయి. కనుక పుట్టగొడుగులతో చేసే వంటకాలను కూడా మళ్లీ మళ్లీ వేడి చేయరాదు.
చాలా మంది అన్నంను వేడి చేసి తింటుంటారు. కొందరు చద్దన్నం తింటారు. ఈ రెండు నిజానికి హానికరమే. అన్నం వండిన తరువాత వీలైనంత త్వరగా తినేయాలి. సమయం గడిచే కొద్దీ అందులో నాణ్యత పోతుంది. దీంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. అన్నం వండిన తరువాత 2 గంటల్లోగా తింటే మంచిది.
పాలకూరలో ఐరన్, నైట్రేట్, ఇతర పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తాజాగా తీసుకుంటేనే మేలు జరుగుతుంది. దీంతో చేసిన వంటలను కూడా మళ్లీ మళ్లీ వేడి చేయరాదు.