ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం అన్ని పోషకాలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందులో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శరీరానికి శక్తితోపాటు పోషణ లభిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు. అయితే అధిక బరువు తగ్గేందుకు, బరువు నియంత్రణలో ఉండేందుకు ఫైబర్ (పీచు పదార్థం) కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైబర్ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే అధిక బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలని భావించే వారు ఫైబర్ ఉన్న ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైబర్‌లో రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. ఒక సాల్యుబుల్ ఫైబర్. రెండోది ఇన్ సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ నీటిలో కరుగుతుంది. ఇది పండ్లు, బీన్స్, జొన్నలు, నట్స్, కూరగాయల్లో ఉంటుంది. ఇక ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ అంత త్వరగా నీటిలో కరగదు. కొంత సమయం పడుతుంది. ఈ రకం ఫైబర్ పండ్లు, నట్స్, కూరగాయలు, తృణ ధాన్యాల్లో ఉంటుంది. ఈ రెండు రకాల ఫైబర్‌లు ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీని వల్ల బరువును తగ్గించుకోవచ్చు.
అధిక బరువు సమస్యతో బాధపడేవారితోపాటు బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీని వల్ల జీర్ణాశయం నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో క్యాలరీలు తక్కువగా అందుతాయి. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
ఫైబర్ ఉన్న ఆహారాలను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు రోజూ ఫైబర్ ఉండే ఆహారాలను తింటే మంచిది. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
మన జీర్ణాశయంలో మంచి బాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అయితే ఫైబర్ ఉండే ఆహారాలను తినడం వల్ల జీర్ణాశయంలోని మంచి బాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
ఫైబర్ ఉండే ఆహారాలను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణాశయంలో అల్సర్లు రాకుండా ఉంటాయి.
ఇక రోజూ మనం తినే ఆహారం నుంచి ఫైబర్ 25 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు మనకు అందాలి. అప్పుడే పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365