కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నా లేదంటే స్నేహితులతో కలసి రూమ్‌లో ఉంటున్నా.. ఎలా ఉన్నా కొన్ని సందర్భాలలో ఇతర వ్యక్తులు వాడే వస్తువులను తీసుకుని వాటిని మనం వాడుతుంటాం. సాధారణంగా ఇలా ఎవరైనా వాడుతారు. అయితే మీకు తెలుసా..? ఇతరులకు చెందిన కొన్ని వస్తువులను మాత్రం అలా వాడకూడదట. అవును, మీరు విన్నది నిజమే. అది కుటుంబ సభ్యులు అయినా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, వేరే ఎవరైనా అయి ఉండవచ్చు, ఇతరులు వాడే పలు వస్తువులను మాత్రం మన వాడకూడదు. అవేమిటో, ఆ వస్తువులను ఎందుకు వాడకూడదో, వాటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లిప్ స్టిక్‌ను ముఖ్యంగా మహిళలు వాడుతారు. అయితే ఒకరు వాడే లిప్‌స్టిక్‌ను మరొకరు వాడకూడదు. ఎందుకంటే నోరు, పెదవులపై ఉండే ఉమ్మిలో హెర్పస్ అనే వ్యాధిని కలగజేసే బాక్టీరియా ఉంటుందట. ఈ క్రమంలో అలాంటి బాక్టీరియా ఉన్న వారికి చెందిన లిప్‌స్టిక్‌ను తీసి వేసుకుంటే దాన్ని వేసుకున్న వారికి కూడా హెర్పస్ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తులకు ఆ వ్యాధి లేకపోయినా బాక్టీరియా మాత్రం నోరు, పెదవులపై ఉండేందుకు అవకాశం ఉంటుందట. కనుక ఇతర మహిళలు వాడే లిప్‌స్టిక్‌ను వేసుకోకపోవడమే మంచిది. ఒక వేళ వేసుకున్నాక పెదవులు ఎర్రగా అయి ఇన్‌ఫెక్షన్ వచ్చేట్టు ఉంటే వెంటనే లిప్‌స్టిక్‌ను తీసేయాలి. అనంతరం డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది.
హెడ్‌ఫోన్స్ అయితే ఒకరు వాడినవి మరొకరు చాలా కామన్‌గా వాడుతుంటారు. కానీ ఇలా కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చెవిలో తయారయ్యే గులిమి కారణంగా అందులో బాక్టీరియా ఉత్పన్నమవుతుంది. అది హెడ్‌ఫోన్స్‌కు అంటుకుంటుంది. దీంతో అలాంటి హెడ్‌ఫోన్స్‌ను ఇతరులు చెవిలో పెట్టుకుంటే వారి చెవిలోకి బాక్టీరియా వెళ్లి ఇన్‌ఫెక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఒకరు వాడే ఇయర్ ఫోన్స్‌ను మరొకరు వాడరాదు. అయితే ఇయర్ ఫోన్స్‌ను క్లీన్ చేసుకుంటే ఎవరైనా వాడవచ్చు. అందుకు ఏం చేయాలంటే కాటన్ బడ్స్‌ను హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా స్పిరిట్‌లో ముంచి వాటితో ఇయర్ ఫోన్స్ బడ్స్‌ను క్లీన్ చేయాలి. అనంతరం వాటిని ఎవరైనా నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.
హెయిర్ క్లిప్స్, కర్లర్స్, దువ్వెనలు.. వీటిని కూడా ఒకరు వాడినవి మరొకరు వాడరాదు. ఒక్కొక్కరి జుట్టులో ఫంగస్, సూక్ష్మజీవులు, బాక్టీరియా ఉంటాయి. అలాంటి సందర్భంలో వాటిని తాకిన హెయిర్ క్లిప్స్, కర్లర్స్, దువ్వెనలను మరొకరు వాడితే వారికి ఆ బాక్టీరియా వ్యాపించి ఇన్‌ఫెక్షన్లు, చుండ్రు వంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఒకరు వాడినవి మరొకరు వాడరాదు. చంకల్లో రుద్దుకునే డియోడరంట్స్‌ను కూడా ఒకరు వాడినవి మరొకరు వాడరాదు. లేదంటే వారి చంకల్లో ఉండే బాక్టీరియా ఇతరులకు వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. దాని వల్ల చర్మం ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఒకరు వాడే టవల్స్‌ను కూడా మరొకరు వాడరాదు. వారి చర్మంపై ఉండే బాక్టీరియా, ఫంగస్ పెద్ద ఎత్తున టవల్‌పై ఉంటాయి కాబట్టి ఒకరు వాడిన టవల్‌ను మరొకరు వాడితే ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నెయిల్ క్లిప్పర్లు, ట్వీజర్లు, రేజర్లు, ఇతర కాస్మొటిక్స్, యాక్ససరీలను కూడా ఒకరు వాడిన వాటిని మరొకరు వాడరాదు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ముఖాన్ని శుభ్రం చేసే బ్రష్‌లు, మసాజ్ రోలర్లు, స్పాంజ్‌లు వంటి వాటిని ఒకరు వాడినవి మరొకరు వాడరాదు. చర్మంపై ఉండే బాక్టీరియా ఇతరుల చర్మంపైకి చేరుతుంది. అది మొటిమలను, మచ్చలను సృష్టిస్తుంది. చెప్పులను కూడా ఒకరు వాడినవి మరొకరు వాడరాదు. ఫంగస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.