రోడ్ల పక్కన ఏదైనా చిరు తిండి కంటికి ఇంపుగా కనబడితే చాలు, వెంటనే తినేస్తాం. ఎందుకంటే మనలో జిహ్వా చాపల్యం అలా ఉంటుంది కనుక. అయితే నోటి రుచి ఏమోగానీ రోడ్డు పక్కన దొరికే ఏ ఆహారాన్నయినా, ఆ మాటకొస్తే ఇంట్లో కాకుండా బయట ఎక్కడ, ఏ ఆహారం తిన్నా సదరు ఆహారం శుభ్రమైన వాతావరణంలోనే వండారా..? అంతా శుభ్రంగానే చేశారా..? నాణ్యమైన పదార్థాలనే వాటిలో ఉపయోగించారా..? అన్నది మనం కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే వివిధ రకాల అనారోగ్యాలు వస్తాయి. అయితే అక్కడి వరకు బాగానే ఉన్నా ఇంకా ఒక్క విషయంలో మనం అలాంటి ఆహారం పట్ల కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. అదేంటంటే…
బయట మనం ఎక్కడైనా బజ్జీలు, పునుగులు ఇతర బేకరీ ఫుడ్స్ తినేటప్పుడు చాలా వరకు న్యూస్ పేపర్లలోనే పెట్టుకుని తింటాం కదా… కొందరైతే పూరీల వంటి నూనె వస్తువులను న్యూస్ పేపర్లలో పెట్టి వాటి నుంచి నూనెను పిండేసి ఆ తరువాత వాటిని తింటారు. అనంతరం కొందరైతే ఏదైనా తిన్న తరువాత న్యూస్ పేపర్లతోనే చేతులు, మూతి తుడుచుకుంటారు. ఇంకా కొందరైతే మిక్చర్ వంటి పదార్థాలను ఏకంగా న్యూస్ పేపర్ పైనే వేసి ఎంచక్కా ఆరగిస్తారు. అయితే నిజానికి ఇలా చేయడం చాలా ప్రమాదకరమట. ఇది మేం చెబుతున్నది కాదు, సైంటిస్టుల పరిశోధనలో తేలిన నిజం.
న్యూస్ పేపర్లలో వాటి తయారీకి వినియోగించే ప్రింట్, పిగ్మెంట్స్, బైండర్స్, అడిటివ్స్ వంటి వాటితోపాటు మన శరీరానికి హాని కలిగించే ఫ్తాలేట్ అనే ప్రమాదకర రసాయనం కూడా ఉంటుందట. ఈ క్రమంలో పైన చెప్పిన విధంగా న్యూస్ పేపర్లను వాడినప్పుడు దాంతో ముందు చెప్పిన కెమికల్స్ అన్నీ మన శరీరంలోకి వెళ్తాయట. అలా చేరిన కెమికల్స్ మనకు ప్రాణాంతక వ్యాధులను తెచ్చి పెడతాయట. ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశోధక బృందం ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలో సదరు కెమికల్స్ వల్ల మనకు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు వహించాలని, ఆహార పదార్థాలను న్యూస్‌పేపర్లలో పెట్టుకుని తినడం మానేయాలని, తిన్న తరువాత కూడా చేతులు, మూతి తుడుచుకునేందుకు వాటిని వాడవద్దని పరిశోదకులు హెచ్చరిస్తున్నారు.