మా ఊళ్ళో కుళాయి నీరే కుండలోను, వాటర్ ఫిల్టర్‌లోనూ పోసుకుని తాగేవాళ్ళం – క్రమంగా చుట్టూ సభ్యసమాజం ప్యూరిఫయర్లు పెట్టించుకుంటున్నారు. అయితే గత రెండేళ్ళుగా కార్పొరేషన్ నీరు కంటికి కనపడేంత లేత బురద రంగులో వస్తున్నాయి. ప్యూరిఫయర్ పెట్టించుకునే ఇష్టం లేక కొన్నాళ్ళుగా మినరల్ వాటర్ క్యాన్లు వేయిస్తున్నాం. సహజంగా దొరికే మంచి నీటిలో ఖనిజాలు(మినరల్స్) ప్రకృతి సిద్ధంగా ఉంటాయి… ఉండేవి. బలవంతంగా అలవాటు చెయ్యబడ్డ ప్యూరిఫైడ్ నీటి పుణ్యమా ఇదివరకు స్వచ్చంగా సరఫరా అయ్యే కుళాయి నీరు ఇప్పుడు అనాగరికం అయిపోయింది, పల్లెల్లో సైతం.
అసలింతకూ ఆ మినరల్ వాటర్‌లో ఉన్న ఖనిజాలేమి? magnesium, calcium, potassium, sodium, bicarbonate, iron , zinc వంటి మినరల్స్ ఉండాలి. ఉదాహరణకు మెగ్నిషియంను తీసుకుంటే బీపీ, గ్లూకోజ్, నాడీ వ్యవస్థల నియంత్రణకు అవసరం. ఇది ప్రకృతిసిద్ధ నీటిలో సహజంగానే లభ్యం. కానీ కలుషిత నీటి దెబ్బకు ఆ ఖనిజ లోటుతో దీర్ఘకాలంలో ఆకలి లేకపోవటం, అలసత్వం, కండరాల బలహీనత వంటివి తలెత్తవచ్చు. ఇలా ఆయా ఖనిజాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నందున, కుళాయి నీరు ఇంతకు మునుపులా స్వచ్చంగా సరఫరా కానందున, మినరల్ నీరే దిక్కయింది.
అయితే, ఆ మినరల్ వాటర్ ప్లాస్టిక్ సీసాలు, పీపాల్లో నిలువ ఉంచటంవల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు అని కొందరు శాస్త్రజ్ఞుల సిద్ధాంతం. పైగా పెరిగిన ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే కాలుష్యంతో భూమికీ చేటు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం – నిజంగా మినరల్ వాటర్ సీసాల్లోని నీటిలో మినరల్స్ ఉంటున్నాయా అని ఎప్పటికప్పుడు పరీక్షించే నమ్మకమైన వ్యవస్థ ఉందా? లేకపోతే ఆహార (పండ్లు, కాయగూరలు, పాలు, నూనె, తేనె, వగైరా) కల్తీలాగే నీరు కూడా నిర్లక్ష్యానికి గురైనా పట్టించుకోని జనం రాబోవు తరాలకు కారణాలు తెలియని/తెలుసుకోలేని అనారోగ్యాలను బహూకరిస్తున్నామా? దీనిపై లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది.