నిద్రలేని రాత్రులు అధికమయ్యాయా? మంచి నిద్రపోయి చాలా రోజులయిందా? గాఢ నిద్ర పడితే…మరుసటి రోజు ఎంతో ఫ్రెష్. గాఢ నిద్ర రోజూ పడితే…అనారోగ్యం దగ్గరకే రాదు. కనుక గాఢ నిద్రపోయి సేద దీరాలనుకునే వారికి నార్తంబ్రియా యూనివర్శిటీ పరిశోధకులు మంచి ఫార్ములా కనుగొన్నారు. నిద్ర పట్టటమే కాదు అదనంగా 25 నిమిషాలు ఆదమరచి కూడా నిద్రిస్తారట. మరి ఏం చేయాలో చూడండి. ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక్క గ్లాసెడు చెర్రీ జ్యూస్ తాగండి.
చెర్రీ జ్యూస్ శరీరంలోని నిద్రకు సహకరించే మెలటోనిన్ హార్మోన్ స్ధాయిని గణనీయంగా పెంచి గురకలు పెట్టిస్తుందని, ఈజ్యూస్ తాగిన వారు అదనంగా 15 నుండి 20 నిమిషాలు నిద్రపోతున్నారని రీసెర్చర్లు వెల్లడించారు. నిద్రలేమితో బాధపడే వారికే కాదు, జెట్ లాగ్ లేదా షిఫ్టు వర్కింగ్ ల కారణంగా కూడా నిద్ర సరిగా లేనివారు సైతం చెర్రీ జ్యూస్ రెగ్యులర్ గా తాగుతూంటే కంటినిండా హాయిగా నిద్రించవచ్చునని అధ్యయనం తెలుపుతోంది.
చెర్రీ జ్యూస్ తాగిన వారు పగటిపూట ఏ మాత్రం నిద్రపట్టే సూచనలు కూడా లేకుండా ఎంతో చురుకుగా వారి రోజువారీ పనుల్లో పాల్గొంటున్నారట. చెర్రీ జ్యూస్ ప్రభావం శరీరంలో రాత్రి నిద్రను ప్రభావించే మెలటోనిన్ హార్మోన్ పై బాగా వుంటుందని అధ్యయనం తెలిపింది. ఈ రీసెర్చి ఫలితాలు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు.