Stomach Waste : మనలో కొందరికి భోజనం చేసిన 2 నుండి 3 గంటల తరువాత తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు త్రేన్పులతో పాటు తిన్న ఆహారాలు కూడా గొంతులోకి వస్తూ ఉంటాయి. అలాగే కొందరిలో ఉదయం బ్రష్ చేసేటప్పుడు పసురు వస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా పుల్లగా ఉంటుంది. అజీర్తి సమస్యలు ఉండడం వల్ల ఇలా పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారం జీర్ణమవ్వాలంటే జీర్ణరసాలతో పాటు కొన్ని రకాల ఎంజైమ్ లు కూడా చాలా అవసరం. ఆహారం జీర్ణం అవ్వడానికి పైత్య రసం, ప్రాంకియాటిక్ రసాలతో పాటు ఎమైలేజ్, ప్రొటిలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్ లు కూడా చాలా అవసరం.
ఇవి సరిగ్గా తగిన మోతాదులో విడుదల అయితేనే మనం తిన్న ఆహారం పులవకుండా త్వరగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్యతో బాధపడే వారికి మందులు, టానిక్ లను ఇవ్వడం వల్ల ఈ జీర్ణ రసాలు, ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పుల్లటి త్రేన్పులు రాకుండా ఉంటాయి. అయితే మందులు వాడకుండా సహజ సిద్దంగా కూడా మనం అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు. పుల్లటి త్రేన్పులు రాకుండా చూసుకోవచ్చు. అజీర్తి, పుల్లటి త్రేన్పులు వంటి సమస్యలతో బాధపడే వారు జీరా వాటర్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీలకర్రతో చేసే ఈ నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
జీలకర్రలో థైమాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరమయ్యే ఎంజైమ్ లను, జీర్ణ రసాలను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణరసాలు, ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తిన్న ఆహారం పులియకుండా త్వరగా జీర్ణమవుతుంది. దీంతో అజీర్తి, పుల్లటి త్రేన్పులు, పసురు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట శుభ్రపడుతుంది. అజీర్తి సమస్యను తగ్గించే ఈ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి నీటిని మరిగించాలి. ఈ నీటిని ముప్పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న జీలకర్ర నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. ఇలా వారం నుండి పది రోజుల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం పులియకుండా చక్కగా జీర్ణమవుతాయని , పుల్లటి త్రేన్పులు, అజీర్తి సమస్యలు తగ్గి పొట్ట చక్కగా శుభ్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.