Green Peas Upma : మనం సులభంగా చేసుకోదగిన అల్పాహారాల్లో ఉప్మా కూడా ఒకటి. బొంబాయి రవ్వతో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను చాలా తేలికగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఉప్మాను తినడానికి ఇష్టపడరు. సరిగ్గా చేయాలే కానీ ఉప్మా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఉప్మాను తినని వారు కూడా ఇష్టంగా తినేలా ఉప్మాను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బఠాణీతో ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక గ్లాస్, నానబెట్టిన పచ్చి బఠాణీ – అర కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 3, టమాట ఫ్యూరీ – ఒక కప్పు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన అల్లం – ఒక టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత.
పచ్చి బఠాణీ ఉప్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత బఠాణీని వేసి వేయించాలి. తరువాత అల్లం ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండున్నర నుండి మూడు కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి కలిపి నీటిని మరిగించాలి.
నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత ఈ ఉప్మాపై నెయ్యిని వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి బఠాణీ ఉప్మా తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా చట్నీతో కూడా కలిపి తినవచ్చు. ఈ విధంగా చేసిన ఉప్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.