Black Tea : చాలా మంది ఉదయాన్నే తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే పరగడుపునే టీ తాగే వారే చాలా ఎక్కువగా ఉంటారు. చాలా మంది టీ ప్రియులు ఉదయాన్నే రకరకాల టీలను రుచి చూస్తుంటారు. అందులో భాగంగానే వారు మిల్క్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లూ టీ.. ఇలా తాగుతుంటారు. టీ లేనిదే చాలా మంది తమ రోజును మొదలుపెట్టరు. ఇది అంతగా మన దినచర్యలో భాగం అయిపోయింది. అయితే కొందరు టీ తాగొద్దని అంటారు, కొందరు తాగాలని అంటారు. కానీ టీ తాగినా, తాగకపోయినా.. దాన్ని ముఖ్యంగా ఖాళీ కడుపుతో అయితే అసలు తాగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ టీని ఖాళీ కడుపుతో అసలు సేవించకూడదని అంటున్నారు. ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
పరగడుపునే బ్లాక్ టీ తాగడం వల్ల సాధారణ టీ కన్నా మన శరీరంలోకి ఎక్కువ కెఫీన్ వచ్చి చేరుతుంది. ఇది మోతాదుకు మించితే ప్రమాదం. దీని వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర సరిగ్గా పోకపోతే మళ్లీ అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం పరగడుపున బ్లాక్ టీ తాగడం మంచిది కాదు. అలాగే ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఎముకలు బలహీనంగా మారుతాయి. రక్తం మరింత పలుచగా మారుతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగితే డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో శరీరంలో ఉండే ద్రవాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది ఎండదెబ్బకు కారణమవుతుంది. అలాగే కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక ఉదయం పరగడుపునే బ్లాక్ టీ తాగకూడదు. అలా అని చెప్పి సాధారణ టీ తాగడం కూడా మంచిది కాదు. ఉదయం ఏదైనా అల్పాహారం చేసిన తరువాత మాత్రమే ఏ టీ లేదా కాఫీ అయినా సరే తాగవచ్చు. లేదంటే అనారోగ్యాలకు ఊతం ఇచ్చిన వారు అవుతారు.