Drinking Water : వేసవి కాలంలో దాహం వేస్తుంది కనుక మనం నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటాం. 4 నుండి 5 లీటర్ల నీటిని కూడా చాలా తేలికగా తాగేస్తూ ఉంటారు. అదే 4 నుండి 5 లీటర్ల నీటిని చలికాలం తాగడానికి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలం నీటిని ఎక్కువగా తాగితే మూత్రానికి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుందని అలాగే దాహం వేయడం లేదని చాలా నీటిని తక్కువగా తాగుతారు. చలికాలంలో రెండు లేదా మూడు లీటర్ల కంటే ఎక్కువగా నీటిని చాలా మంది తాగరు. అసలు చలికాలం నీటిని తగ్గించి తాగవచ్చా, తగకూడదా అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం కూడా 4 నుండి 5 లీటర్ల నీటినే తాగాలి.. తక్కువగా నీటిని తాగకూడదు. చలికాలం చెమట పట్టకపోయినప్పటికి చర్మంలో నీరు ఆవిరైపోతూ ఉంటుంది.
అర లీటర్ నుండి ముప్పావు లీటర్ వరకు నీరు చర్మం నుండి ఆవిరైపోతుంది. శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఇలా నీరు ఆవిరై పోతూ ఉంటుంది. వేసవికాలంలో నీరు చర్మం ద్వారా ఎక్కువగా, మూత్రం ద్వారా తక్కువగా అలాగే చలికాలంలో మూత్రం ద్వారా ఎక్కువగా, చెమట రూపంలో తక్కువగా నీరు బయటకు పోతుంది. కాబట్టి చలికాలం కూడా నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే చలికాలంలో వాతవరణంలో తేమ తక్కువగా ఉంటుంది. దీంతో మన శరీరంలో ఉండే తేమను గాలి బయటకు లాగేసుకుంటుంది. శరీరంలో నీరు ఎక్కువగా చలికాలంలో తేమ రూపంలో బయటకు వస్తుంది. శరీరం లోపల నీరు తగ్గే కొద్ది చర్మం పొడిబారుతుంది. చలికాలంలో చర్మం తెల్లగా, పొడిబారడానికి కారణం ఇదే. శరీరానికి నీరు చాలకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చర్మం పగలడం, చర్మం మండడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
నీరు తక్కువగా తాగడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. చలికాలం ఐదు లీటర్ల నీటిని తాగకపోయినా కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే చలికాలం అయినప్పటికి మన ఆహారపు అలవాట్లల్లో ఎటువంటి మార్పు చేయడం లేదు. యధావిధిగా ఉప్పు, నూనెలను తీసుకుంటూ ఉంటున్నాం. కనుక నీటిని కూడా ఎక్కువగానే తాగాలి. అదే విధంగా మన శరీరంలో కాలేయం డిటాక్సిఫికేషన్ రాత్రంతా చేస్తూనే ఉంటుంది. కాలేయం నుండి వెలువడిన వ్యర్థాలు, మలినాలు 80 శాతం మూత్రం ద్వారానే బయటకు పోతాయి. మూత్ర విసర్జన ఎంత ఎక్కువగా చేస్తే ఈ మలినాలు అంత ఎక్కువగా బయటకు వెళ్లిపోతాయి. నీటిని తక్కువగా తాగడం వల్ల ఈ మలినాలు బయటికి వెళ్లక శరీరంలోనే పేరుకుపోతాయి. చలికాలం అని నీటిని తక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
చలికాలంలో రాత్రి సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పగటి సమయంలోనే నీటిని ఎక్కువగా తాగాలి. సాయంత్రం 5 గంటల వరకు నీటిని తాగి ఆపై తాగకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న నీరు రాత్రి పది గంటల వరకు మూత్రం ద్వారా బయటకు పోతుంది. దీంతో రాత్రి లేచే అవసరం ఉండదు. చలికాలంలో నీర కూడా చల్లగా ఉంటుంది. కనుక ఈ నీటిని కొద్దిగా గోరు వెచ్చగా చేసుకుని తాగాలి. ఈ విధంగా చలికాలం కూడా మనం 4 నుండి 5 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యలను కొన్ని తెచ్చకున్న వాళ్లం అవుతామని నిపుణులు చెబుతున్నారు.