మనం నిత్యం వ్యాయామం చేసినా, పౌష్టికాహారం తీసుకున్నా.. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర పోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరికి పలు కారణాల వల్ల నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రి పూట ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల నిద్ర బాగా వస్తుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
ప్రోటీన్లు ఉండే ఆహారాలను తినడం వల్ల మన శరీరంలో ట్రిప్టోఫాన్ అనబడే సమ్మేళనం ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. అందువల్ల రాత్రి పూట ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పాలను తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
కోడిగుడ్లు, చికెన్, చియా సీడ్స్, కాలిఫ్లవర్, బెర్రీలు, అవిసె గింజలు, చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది.
అరటి పండ్లు: అరటి పండ్లలో ట్రిప్టోఫాన్, మెగ్నిషియంలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి.
ఓట్ మీల్: ఓట్స్‌లలో మెలటోనిన్ ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.
చీజ్: చీజ్‌లో ఉండే ప్రోటీన్లు కూడా నిద్రలేమి సమస్యకు చక్కగా పనికొస్తాయి. చీజ్‌లోని ప్రోటీన్లు రాత్రి పూట కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. అందువల్ల రాత్రి ఆహారంలో చీజ్ తింటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
డార్క్ చాకొలెట్: డార్క్ చాకొలెట్‌లలో సెరొటోనిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని, మనస్సును ప్రశాంత పరుస్తుంది. దీంతోపాటు నిద్ర బాగా వస్తుంది.
చెర్రీలు: రోజుకు 10 నుంచి 12 చెర్రీ పండ్లను తినడం వల్ల కూడా నిద్ర లేమి సమస్య నుంచి బయట పడవచ్చు. వీటిల్లో ఉండే మెలటోనిన్ నిద్రలేమిని తగ్గిస్తుంది.
రాత్రి పూట చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ తీసుకోరాదు. దీని వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. వీటికి దూరంగా ఉంటే నిద్రలేమిని తగ్గించుకోవచ్చు. నిద్ర బాగా పడుతుంది.