Fenugreek Seeds And Cinnamon : మనలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, నరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇటువంటి సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం శరీరంలో పోషకాల లోపం తలెత్తడమే. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ డి, పొటాషియం వంటి మినరల్స్ లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల కూడా కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి. కొన్ని రకాల ఆహార నియమాలను పాటిస్తూ అలాగే చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు.
మనం తీసుకోవాల్సిన ఆహారాలు అలాగే వాడాల్సిన చిట్కాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో అరటి పండు ఒకటి. అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది నొప్పులను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నిద్రలో కాళ్లు పట్టుకుపోవడం, పిక్కలు పట్టుకోవడం వంటి సమస్యలతో బాధపడే వారు రోజుకు రెండు అరటి పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. బంగాళాదుంపను, పాల పదార్థాలను తీసుకోవడం వల్ల మనం ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే రోజూ భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన మెగ్నీషియం, ఐరన్ లభిస్తుంది.

అలాగే బాదంపప్పు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం తలెత్తకుండా ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజూ మెంతులను తీసుకోవడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ మెంతులను, ఒక ఇంచు దాల్చిన చెక్కను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగుతూ మెంతులను, దాల్చిన చెక్కను నమిలి తినాలి. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో వాత దోషాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ఉండే మోకాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడే వారు ఈ విధంగా మెంతులను, దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ విధంగా మెంతులను తీసుకుంటూనే రోజూ రాత్రి పసుపు కలిపిన పాలను తీసుకోవాలి. పసుపు కలిపిన పాలను తాగడం వల్ల క్యాల్షియం లోపం తలెత్తకుండా ఉంటుంది. అలాగే శరీరంలో ఉండే నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా తగిన ఆహార నియమాలు పాటిస్తూ ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల శరీరంలో నొప్పులన్నింటిని తగ్గించుకోవచ్చని అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.