Flax Seeds Laddu : అవిసె గింజలు.. అనేక రకాల పోషకాలు కలిగిన ఆహారాల్లో ఇవి కూడా ఒకటి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక విధాలుగా అవిసె గింజలు మనకు సహాయపడతాయి. వీటిని వేయించి తీసుకోవడంతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. అవిసె గింజలతో మనం చాలా సులభంగా లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా అవిసె గింజలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
అవిసె గింజలు – ఒక కప్పు, పల్లీలు – అర కప్పు, ఎండుకొబ్బరి పొడి – అర కప్పు, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, గోధుమపిండి – అర కప్పు, యాలకులు – 3 లేదా 4, బెల్లం తురుము – ఒక కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
అవిసె గింజల లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో అవిసె గింజలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై దోరగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగిన తరువాత కొబ్బరి పొడి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నువ్వులను కూడా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమపిండి వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో అవిసె గింజలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో వేయించిన పల్లీలు, కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, వేయించిన గోధుమపిండి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అవిసె గింజల లడ్డూ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.