వర్షాకాలంలో సహజంగానే మనకు అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సీజన్ వస్తూనే అనారోగ్యాలను మోసుకుని వస్తుంది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ వ్యాధులు చిన్నారులకు కూడా వస్తుంటాయి. అందువల్ల వారిని ఆయా వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన సూచనలను పాటించాల్సి ఉంటుంది.
1. దుస్తులు
ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సహజంగానే తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. కనుక కాటన్ దుస్తులు అయితే మంచిది. చిన్నారుల శరీర భాగాలను పూర్తిగా కప్పి ఉంచే పొడవాటి దుస్తులను ధరింపజేయాలి. దీని వల్ల వారి శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా ఉంటుంది.
2. దోమలు
చిన్నారులను దోమలు కుట్టకుండా అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలి. ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలి. చిన్నారులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరింపజేయాలి. మస్కిటో రీపెల్లెంట్లను వాడాలి. దోమ తెరలను ఉపయోగించాలి.
3. స్నానం
చిన్నారులు రోజూ కచ్చితంగా స్నానం చేసేలా చూడాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే నూనెతో శరీరాన్ని మర్దనా చేసి స్నానం చేయిస్తే మంచిది. నువ్వుల నూనెను మర్దనాకు ఉపయోగించాలి.
4. ఆహారం
చిన్నారులను ఆరోగ్యంగా ఉంచేందుకు చక్కని పౌష్టికాహారాన్ని రోజూ ఇవ్వాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, నట్స్ ను ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇలా ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ సీజన్లో చిన్నారులకు అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చు.