Heart Attack : చాక్లెట్.. దీనిని ఇష్టపడని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాక్లెట్ ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ బరువు పెరుగుతామనే కారణం చేత చాలా మంది దీనిని తినడానికి భయపడతారు. కోకో చెట్టు విత్తనాలతో చాక్లెట్ ను తయారు చేస్తారు. రుచితోపాటు అనేక ప్రయోజనాలను డార్క్ చాక్లెట్ కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మెదడుకు, గుండెకు రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చేయడంలో కూడా డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చాక్లెట్ తినడం వల్ల ఎటువంటి హాని కలగదని పైగా చాక్లెట్ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్క వారంలో ఆరు చాక్లెట్ బార్ లను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. క్రమం తప్పకుండా రోజూ చాక్లెట్ లను తినడం వల్ల 33 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని 20 శాతం మేరకు మరణాంతక జబ్బులు తగ్గుతాయని వైద్యులు చేసిన పరిశోధనల్లో తేలింది.
నెలలో మూడు సార్లు చాక్లెట్ తినే వారిలో 10 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అలాగే వారంలో ఒక సర్వింగ్ చాక్లెట్ తినే వారికి 17 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. అదే విధంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో ఎక్కువైయ్యింది. ఈ సమస్యల బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండె జబ్బులను నివారించే మరికొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చిక్కడు కాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగిపోయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సముద్రపు ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు 50 శాతం తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
వారానికి ఒకటి లేదా రెండు సార్లు సముద్రపు ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. సముద్రపు ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అలాగే రక్తంలో కొవ్వు శాతాన్ని క్రమబద్దీకరించడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని గుండె సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.