Foods For Bones Health : మన శరీరానికి ఆకృతిని ఇచ్చేవి ఎముకలు. ఎముకలు ధృడంగా ఉంటేనే ఎముకలు, అస్థిపంజరం అన్నింటిని పట్టి గట్టిగా ఉండగలుగుతుంది. కనుక మనం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం, విటమిన్ డి అవసరమని మనందరికి తెలుసు. కానీ ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం వ్యాయామం కూడా చేయాలని మనలో చాలా మందికి తెలియదు. వ్యాయామం చేయడం వల్ల ఎముక కణజాలానికి క్యాల్షియం ఎక్కువగా చేరుతుంది. వ్యాయామాలు చేసే వారికి ఎముకలు ధృడంగా, పుష్టిగా ఉంటాయి. వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది.
చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి వ్యాయామం కూడా చాలా అవసరమని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. వ్యాయామం చేయడం వల్ల కండరాల్లో కదలికలు వచ్చి వాటిలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్తప్రసరణ ఎముకల కణజాలానికి ఎక్కువగా జరుగుతుంది. ఇలా రక్తప్రసరణ ఎక్కువగా జరగడం వల్ల ఎముక కణజాలానికి కావల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. అలాగే వ్యాయామం చేయడం వల్ల ఎముక కణజాలం క్యాల్షియంని ఎక్కువగా గ్రహించుకుంటుంది.
కనుక మనం ప్రతిరోజూ గంట నుండి రెండు గంటల పాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎముకలు పుష్టిగా ఉండాలనుకునే వారు శారీరక వ్యాయామం చేయాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ప్రేగులు పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ కె, విటమిన్ డి వంటి పోషకాలు బాగా గ్రహించబడతాయి. దీంతో ఈ పోషకాలు ఎముకలకు చక్కగా అంది ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా కూడా వ్యాయామం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి.
ఎండలో ఉండడం, విటమిన్ డి ఉండే పదార్థాలను తీసుకోవడం, విటమిన్ డి క్యాప్సుల్స్ ను తీసుకోవడం వంటివి చేయాలి. శరీరంలో తగినంత విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు ధృడంగా ఉండడంతో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి . తోటకూర, పొన్నగంటి కూర, మునగాకు, మెంతికూర, కరివేపాకు వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ కె వంటి పోషకాలన్నీ అంది ఎముకలు ధృడంగా ఉంటాయి. ఎముకలు ధృడంగా ఉంటేనే మనం ధృడంగా ఉండగలుగుతాము. మనం మన పనులను సక్రమంగా నిర్వర్తించగలుగుతాము. కనుక మనం ఇటువంటి ఆహారాలను తీసుకుని ఎముక పుష్టిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.