Foods For Liver Diseases : మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలను ఇది ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. లివర్ వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మనకు శక్తి లభిస్తుంది. అందువల్ల మనం రోజూ తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలి పట్ల శ్రద్ధ వహించాలి. అప్పుడే మన లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొందరికి మాత్రం ఎల్లప్పుడూ ఏదో ఒక లివర్ సమస్య ఉంటుంది.
లివర్ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ ఇచ్చిన మేర మందులను వాడాలి. దీంతోపాటు తీసుకునే ఆహారంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ చెప్పినట్లు డైట్ పాటించాలి. అయితే పలు రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల లివర్ వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. వీటి వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఇక లివర్ ఆరోగ్యం కోసం రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్‌కు మేలు చేసే పసుపు..
పసుపులో కర్‌క్యుమిన్ అనబడే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. కర్‌క్యుమిన్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల లివర్ వాపు తగ్గుతుంది. లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల పసుపును రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పసుపును మీరు రోజూ కషాయంలా తాగవచ్చు. లేదా దీన్ని రాత్రి పూట పాలలో కలిపి కూడా తాగవచ్చు. రోజూ బీట్‌రూట్‌ను తినడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
బీట్‌రూట్‌లో బీటెయిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతాయి. అలాగే బీట్‌రూట్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అందువల్ల బీట్‌రూట్‌ను కూడా రోజూ తినాలి. దీన్ని మీరు సలాడ్, సూప్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఆకుపచ్చని ఆకుకూరలు అయిన పాలకూర, మెంతికూర, కరివేపాకు వంటి వాటిని లివర్‌కు వరంగా చెప్పవచ్చు. లివర్‌కు ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్‌లోని విష పదార్థాలను బయటకు పంపడంతోపాటు లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. కనుక ఆకుకూరలను కూడా వారంలో కనీసం 3 సార్లు తీసుకోవాలి. వీటిని సలాడ్స్, సూప్‌లు, ఇతర కూరగాయలతోనూ కలిపి తీసుకోవచ్చు.
రోజూ గుప్పెడు వాల్ నట్స్ తినాలి..
వాల్‌నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్ వాపును తగ్గిస్తాయి. లివర్‌లోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. అందువల్ల రోజూ గుప్పెడు వాల్ నట్స్‌ను నీటిలో నానబెట్టి తింటే మంచిది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. గ్రీన్ టీని రోజూ సేవిస్తున్నా కూడా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాటెకిన్స్ లివర్ కణాలు డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతోపాటు లివర్ కణాలను రిపేర్ చేస్తాయి. అందువల్ల రోజూ కనీసం 2 కప్పుల గ్రీన్ టీని తాగుతుంటే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో లివర్ వ్యాధులు కూడా త్వరగా తగ్గుతాయి.