Fruits For High BP : జీవన శైలిలో మార్పుల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. ఇది మన శరీరంలోకి చాలా నిశ్శబ్దంగా ప్రవేశించి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, ఆందోళన, అధిక బరువు, ఉప్పు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. వయసుతో సంబంధం లేకుండా నేటి తరుణంలో ఈ సమస్య అందరిని వేధిస్తుంది. తలనొప్పి, చూపు సరిగ్గా కనిపించకపోవడం, వికారం, తల తిరిగినట్టుగా ఉండడం, ఛాతిలో నొప్పి, శ్వాస ఆడనట్టుగా ఉండడం వంటి వాటిని అధిక రక్తపోటు లక్షణాలుగా చెప్పవచ్చు. అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు కారణంగా గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గుండె పోటు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మందులు వాడడంతో పాటు కొన్ని రకాల ఆహార నియమాలను పాటించడం వల్ల కూడా మనం చాలా సులభంగా అధిక రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడే వారు పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటిపోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. సోడియం కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. ఒక రోజుకు ఒక టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బేకరీ పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, సోడాలు, రెడీ టు ఇట్ ఫుడ్ ఐటమ్స్ ను తక్కువగా తీసుకోవాలి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అధిక రక్తపోటుతో బాధపడే వారు పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ మినరల్స్ ఎక్కువగా బీన్స్, పాలు, పెరుగు, బెర్రీస్, కొబ్బరి నీళ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, చియా సీడ్స్, గుమ్మడి గింజలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటుతో బాధపడే వారు ముఖ్యంగా అరటి పండును తీసుకోవాలి. దీనిలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
వీటిలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ తో పాటు విటమిన్ సి, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులోఉంచడంలో సహాయపడతాయి. అదే విధంగా అధిక రక్తపోటుతో బాధపడే వారు పుచ్చకాయను ఆహారంగా తీసుకోవాలి. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ సి రక్తపోటును నియంత్రించడంలో దోహదపడతాయి. అదే విధంగా మామిడి కాయలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆహారనియమాలను పాటిస్తూనే చక్కటి జీవన విధానాన్ని పాటించాలి. యోగా, వ్యాయామం వంటి చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ఈ నియమాలను పాటించడం వల్ల చాలా సులభంగా మనం అధిక రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు.