Gas Trouble Remedy : మనలో చాలా మంది పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మనకు నచ్చిన ఆహారాలను ఇష్టంగా, ఆనందంగా తింటూ ఉంటాము. కానీ వాటిని తిన్న తరువాత ఈ గ్యాస్ సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని వల్ల కడుపులో నొప్పితోపాటు, పొట్టలో, ప్రేగుల్లో అసౌకర్యంగా ఉంటుంది. అలాగే ఈ సమస్య కారణంగా మనం ఇతర పనులను కుదురుగా చేసుకోలేకపోతూ ఉంటాము. మనల్ని ఎంతగానో వేధించే ఈ గ్యాస్ సమస్య తగ్గాలంటే, అలాగే లేని వారికి ఈ సమస్య రాకుండా ఉండాలంటే, మనం కొన్ని మంచి అలవాట్లను పాటించాల్సి ఉంటుంది.
ముందుగా గ్యాస్ సమస్య తగ్గాలంటే ప్రేగులు శుభ్రంగా ఉండాలి. మలబద్దకం సమస్య లేకుండా చూసుకోవాలి. ప్రేగుల్లో మలం నిల్వ ఉండడం వల్ల వివిధ రకాల వాయువులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దీంతో కడుపులో చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే గ్యాస్ సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం లీటరున్నర గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల ప్రేగుల్లో మలం నిల్వ ఉండకుండా ఉంటుంది. ప్రేగులు శుభ్రపడతాయి. అలాగే ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా మరో రెండు గంటల తరువాత మరలా లీటరున్నర నీటిని తాగాలి. ఇలా నీటిని తాగి రోజూ రెండు సార్లు సుఖ విరేచనం అయ్యేలా చూసుకోవాలి.
అలాగే ఆహారాన్ని తినేటప్పుడు నీటిని తాగకూడదు. భోజనం చేసేటప్పుడు నీటిని తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే రసాయనాలు పలుచబడి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దీంతో ఆహారం ఎక్కువ సమయం వరకు నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్న ఆహారం పులిసి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు నీటిని తాగకూడదు. ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత నీటిని తాగాలి. అలాగే రోజుకు మూడు పూటల మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా మధ్య మధ్యలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.
కనుక మధ్య మధ్యలో ఆహారాన్ని తీసుకునే అలవాటు ఉన్న వారు పూర్తిగా మానేయడం మంచిది. గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉన్న వారు ఉదయం, సాయంత్రం తియ్యని పండ్లను తింటూ మధ్యాహ్నం మాత్రమే అన్నాన్ని తీసుకోవాలి. ఇలా వారం నుండి పదిరోజుల పాటు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుండి చక్కటి ఉపశమనం లభిస్తుంది. అదే విధంగా గ్యాస్ సమస్యతో బాధపడే వారు సాయంత్రం 7 గంటలలోపే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ప్రేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల గ్యాస్ సమస్య తగ్గడంతోపాటు, అది లేని వారికి కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.