Water : మన శరీరానికి నీరు ఎంతో అవసరం. నీరు తాగుతున్నారా అని అడిగితే కచ్చితంగా తాగుతున్నాం అనే సమాధానం చెబుతారు. కానీ ఎక్కువగా తాగుతున్నారా అంటే కచ్చితంగా ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు మహా అయితే ఒక లీటర్ నీటిని లేదా ఒక బాటిల్ నీటిని తాగుతారు. నీటిని తాగడానికి బద్దకంగా భావిస్తారు. కొంత మందేమో నీటిని మందులాగా భావిస్తారు. కానీ నీటిని తాగడం చాలా అవసరం. మన శరీరం మూడు వంతులు నీటితోనే నిండి ఉంటుంది. తగినన్ని నీటిని తాగకపోతే మన శరీరానికి అనేక సమస్యలు తలెత్తుతాయి.
శరీరంలో ప్రతి భాగం కూడా నీటిపై ఆధారపడి ఉంటుంది. తగినన్ని నీటిని తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. మలినాలు బయటకు వెళ్లిపోతాయి. జీవక్రియ సాఫీగా సాగుతుంది. మన చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి కూడా నీరు తప్పనిసరి. అయితే శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. శరీరంలో ఎలోక్ట్రోలైట్ స్థాయిలు నియంత్రణలో ఉండవు. శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో మొదటిది మూత్రం రంగులో మార్పు రావడం. మూత్రం ఎక్కువగా పసుపు పచ్చ రంగులో ఉంటే మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడినట్టు అర్థం. మూత్రం తెల్లగా వచ్చే వరకు నీటిని తాగడమే ఈ సమస్య పరిస్కారానికి ఉత్తమమైన మార్గం. అలాగే తరచూ తలనొప్పి రావడం కూడా డీహైడ్రేషన్ కు ఒక కారణం అని చెప్పవచ్చు. తగినన్ని నీటిని తాగకపోవడం వల్ల తలకు రక్తప్రసరణ సరిగా జరగక తలనొప్పి వస్తుంది. తగినన్ని నీటిని తాగడం వల్ల తలనొప్పి దానంతట అదే తగ్గుతుంది. ఇక తగినన్ని నీటిని తాగకపోవడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది.
ఎప్పుడైతే నీటిని తాగకుండా డీహైడ్రేషన్ కు గురవుతామో చర్మం సాగినట్టుగా, పొడిగా కనబడుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలన్నా కూడా తగినన్ని నీటిని తాగాలి. ఇక డీహైడ్రేషన్ కు గురయ్యామని శరీరం చూపించే సంకేతాల్లో ఒకటి కండరాలు పట్టేయడం. శరీరంలో ఏ భాగంలో అయినా ఇది సంభవించవచ్చు. రక్తప్రసరణ సాఫీగా సాగకపోవడం వల్లే కండరాల్లో తిమిర్లు వస్తాయి. ఈ తిమిర్లు పోవాలంటే నీటిని తప్పనిసరిగా తాగాల్సిందే. అలాగే నీటిని తక్కువగా తాగడం వల్ల బీపీ తగ్గుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు నీటితోపాటు ఉప్పును కూడా తక్కువగా తీసుకోవాలి.
అలాగే గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు రావడం కూడా డీహైడ్రేషన్ కు సంకేతం. శరీరంలో నీరు తక్కువగా ఉండడం వల్ల గుండెకు రక్తప్రసరణ సరిగ్గా సాగదు. దీనికి పరిష్కార మార్గం కూడా నీరే. అలాగే నీటిని తక్కువగా తాగడం వల్ల ఎదురయ్యే సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. తగినన్ని నీటిని తాగకపోవడం వల్ల ఆ ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుంది. అధికంగా నీటిని తాగడం వల్ల మలబద్దకం సమస్య ఇట్టే తగ్గుతుంది. అదే విధంగా డీ హైడ్రేషన్ కారణంగా కీళ్ల నొప్పులు కూడా ఎక్కువగా వస్తాయి. కండరాలకు రక్తప్రసరణ తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. కనుక తగినన్ని నీటిని తాగడం ఎంతో అవసరం. ఎక్కువగా నీటిని తాగడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. దీని వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.