Chapati : మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. ఈ కాలంలో అధిక బరువుతో బాధపడడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే మనం ఈ సమస్య బారిన పడేలా చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఉండాల్సిన బరువు కంటే అధికంగా బరువు ఉంటున్నారు. దీంతో వారు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అధిక బరువు నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చాలా మంది బరువు తగ్గడానికి రాత్రిపూట చపాతీలను తింటున్నారు.
వైద్యులు కూడా మనకు రాత్రి పూట చపాతీలను తినమనే సూచిస్తున్నారు. అయితే చపాతీలను తినడంలో అనేక మందికి చాలా సందేహాలు ఉంటున్నాయి. చపాతీలను రాత్రి పూట తినడం మంచిదేనా.. వీటిని రాత్రి తింటే ఏమవుతుంది.. అసలు ఎన్ని చపాతీలను తినాలి.. ఎలా తినాలి.. వంటి సందేహాలు వస్తున్నాయి. అయితే వీటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట చపాతీలను తినడం మంచిదే. దీని వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
అయితే రాత్రి పూట కనుక చపాతీలను రెండే తింటే మంచిది. దీంతో పొట్టలో తేలిగ్గా ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే చపాతీలను నూనె వేయకుండా కాల్చి తినాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక చపాతీలను ఎన్ని పడితే అన్ని తినరాదు. పుల్కాల్లా కాలిస్తే 3.. చపాతీల్లా కాలిస్తే 2 తినవచ్చు. అంతకు మించి తింటే.. పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు. ఇక గ్యాస్, అజీర్ణం, జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట చపాతీలను తినవచ్చు. కానీ రాత్రి 7 గంటల లోపు తింటే మంచిది. దీంతో సమస్యలు ఇంకా ఎక్కువ కాకుండా ఉంటాయి. ఇలా చపాతీలను తిని ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.