Gongura Pappu : మనం తినే ఆకుకూరల్లో ఒకటైన గోంగూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గోంగూరను చాలా మంది ఇష్టంగా తింటారు. గోంగూరతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో గోంగూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గోంగూరలతో ఎంతో రుచికరమైన పచ్చడితో పాటు మనం పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. గోంగూర పప్పును రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర కట్టలు – 3, కందిపప్పు – 150 గ్రా.,తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాటాలు – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
గోంగూర పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాట ముక్కలు, పసుపు, గోంగూర, అర టేబుల్ స్పూన్ నూనె, ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టాలి. దీనిని నాలుగు విజిల్స్ వచ్చే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మూత తీసి ఇందులో ఉప్పు, కారం వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో మరో అర గ్లాస్ నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనిని స్టవ్ మీద ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో చేసిన ఈ పప్పును తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ పప్పును అందరూ విడిచి పెట్టకుండా ఎంతో ఇష్టంగా తింటారు.