Coconut Water Side Effects : కొబ్బరి నీళ్లు.. ఇవి ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొబ్బరి నీళ్లల్లో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా కొబ్బరి నీళ్లను తీసుకోమని సూచిస్తూ ఉంటారు. కొబ్బరి నీటిని తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. తక్షణ శక్తి లభిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. చర్మం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మూత్ర మలవిసర్జనలు సాఫీగా సాగుతాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది.
శరీరంలో ఉండే మలినాలు విష పదార్థాలు తొలిగిపోతాయి. ఇలా అనేక రకాలుగా కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికి వీటిని వల్ల మనం ఒక్కోసారి చిన్న చిన్న దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల విరోచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కనుక కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు, వాటికి సంబంధించిన మందులు వాడే వారు కొబ్బరి నీటిని తాగే ముందు వైద్యున్ని సంప్రదించి తీసుకోవడం మంచిది.
అదే విధంగా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కొందరిలో అలర్జీ కూడా రావచ్చు. చర్మంపై దురద, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇక మూత్రపిండాల్లో రాళ్లతో పాటు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు కూడా ఈ నీటిని తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని తగిన మోతాదులో వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని ఈ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.