Snake Gourd : ఎంతో మంది పొట్లకాయలను తినడానికి ఇష్టపడరు. కానీ పొట్లకాయలలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దవారు బాలింతలకు కూడా పొట్లకాయని ఆహారంలో ఇస్తూ ఉంటారు. ప్రసవం తర్వాత వచ్చే శరీరంలో నీటి శాతాన్ని తగ్గించి, బాలింతలు పూర్వరూపం రావడానికి పొట్లకాయ కూడా ఒక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పొట్లకాయల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయలలో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి లభిస్తాయి. పొట్లకాయలో ఉండే మెగ్నిషియం శరీరంలోని రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు సమస్యను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలతో సతమతమయ్యేవారికి కూడా గ్లాసు పొట్లకాయ రసం ఎంతగానో మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.
అధిక బరువుతో సతమతమవుతున్నవారు కూడా బరువు తగ్గాలనుకుంటే పొట్లకాయను ఆహారంలో తీసుకోవడం ఎంతో ఉత్తమం. పొట్లకాయలలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల వాటిని తింటే కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అంతేకాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి శరీరంలోని వ్యర్ధాలను, విషపదార్థాలను బయటకు పోయేటట్లు చేసి బరువును నియంత్రణలో ఉంచుతాయి.
వీటిలో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కామెర్ల వ్యాధితో బాధపడేవారు కూడా పొట్లకాయ రసాన్ని ఒక టీస్పూన్ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధానంగా అధిక చుండ్రుతో బాధపడుతున్నవారు కూడా పొట్లకాయ రసాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శీకాయ లేదా కుంకుడు కాయతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇలా పొట్లకాయలతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఇవి కనిపిస్తే ఇంటికి తెచ్చుకుని వాడడం మరిచిపోకండి.