నేటి ఆధునిక జీవనంలో నానాటికి పెరుగుతున్న డయాబెటీస్ వ్యాధికి ప్రధాన కారణం అధికబరువు సంతరించుకోవడమని పోషకాహార నిపుణులు భావిస్తున్నారు. వీరు స్టడీ చేసిన వ్యక్తులలో 80 శాతం వరకు పొట్ట భాగం లావెక్కడం లేదా నడుము కొలత 90 సెం.మీ. లకు పైగా వున్నట్లు తెలిపారు. దీనికి కారణం వీరు అధికంగా మాంసాహారం తినడంగాను, ఆహారంలో అధిక ఉప్పు వాడకం వుండటంగాను గుర్తించారు.
అమెరికా దేశంలో సగటున వ్యక్తికి 4 నుండి 6 గ్రాములు ఉప్పు ఖర్చవుతుంటే భారతీయులు షుమారుగా 6 నుండి 8 గ్రాముల వరకు రోజుకు ఉప్పు తింటున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. పోషకాహార నిపుణులు, డయాబెటీస్ వ్యాధికి కారణం సరైన జీవన విధానం కూడా ఆచరించకపోవటమేనని, ప్రత్యేకించి నేటి యువత విభిన్నమైన అనారోగ్య జీవన విధానాలు కలిగి వుందని, దానికితోడు, టెక్నాలజీ అభివృద్ధి సైతం వీరిని శారీరక సోమరులుగా మారుస్తోందని వీరు అభిప్రాయపడ్డారు.
మెట్లు ఎక్కవలసిన అవకాశాలలో లిఫ్ట్ ఉపయోగించటం వంటివి సౌకర్యాన్ని కలుగజేసినప్పటికి, సరైన వ్యాయామాలు లేని కారణంగా వారి శారీరక సమర్ధతలను తగ్గిస్తోందని భావించారు. నిశ్శబ్దంగా ఆక్రమించుకుంటున్న అంటు వ్యాధిగా డయాబెటీస్ ను వీరు గుర్తించారు. దైనందిన జీవితంలో సరైన శ్రమ లేకపోవటం వలన డయాబెటీస్ రోగులకు తప్పని సరిగా రక్తపోటు కూడా వుంటోందని, రెండు వ్యాధులూ కలసి శరీరాన్ని ప్రమాదకరంగా తయారు చేస్తున్నాయని వైద్యులు చెపుతున్నారు.