మనిషిగా పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. కాకపోతే ఒకరు, ముందు మరొకరు వెనుక. అంతే. అయితే త్వరగా చనిపోతే ఆయువు తీరింది, అందుకే చనిపోయాడు అంటారు. అదే చావు బాగా లేట్ అయితే అతనికి ఆయుష్షు బాగా ఉంది, అందుకే ఎక్కువ రోజులు బతికాడు అంటారు. ఈ క్రమంలో ఒక మనిషికి ఆయుష్షు అనేది ముఖ్యమైనది. అయితే ఆయువు అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అది ఎంత ఉంటుందో తెలుసుకోవడం కూడా చాలా కష్టమే. అయినా జీవితంలో కొన్ని పద్ధతులను, అలవాట్లను పాటించడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చట. పురాతన కాలంలో భారత్‌లో కాశ్మీర్ ప్రాంతం, చైనా, ఆఫ్ఘనిస్తాన్ తదితర ప్రాంతాల్లో హుంజాస్ అని పిలవబడే ఓ వర్గానికి చెందిన వారు 145 ఏళ్ల దాకా బతికారట. వారికి ఆయుష్షు అంతగా ఉంటుందట. అయితే అలాంటి వారు ఇప్పుడు అత్యల్ప సంఖ్యలో ఉన్నారనుకోండి. అది వేరే విషయం. కానీ వారు పాటించిన కొన్ని పద్ధతులు, ఆహారపు అలవాట్లు మాత్రం మనకు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటిస్తే మనం కూడా నిండు నూరేళ్లు బతకవచ్చట. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
హుంజాస్ వర్గీయులు ఉదయాన్నే 5.30 గంటలకు నిద్ర లేచే వారట. మధ్యాహ్నం దాకా ఏమీ తీసుకునే వారు కారట. కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండే వారట. మధ్యాహ్నం పూట తృణ ధాన్యాలు, పప్పులతో కూడిన శాఖాహారాన్ని భుజించే వారట. ఎలాంటి రసాయనాలు కలపకుండా పండించిన పండ్లు, తాజా కూరగాయలను వారు ఎక్కువగా తినే వారట. పాలను స్వచ్ఛంగా ఉన్నవే తీసుకునే వారట. కానీ ఇప్పుడు మనకు అన్నీ కృత్రిమ ఎరువు వేసి పండించినవే లభిస్తున్నాయి. ఇక పాల విషయానికి వస్తే, అసలువి ఏవో, నకిలీవి ఏవో గుర్తించడమే కష్టంగా మారింది. కాగా హుంజాస్ వారు పండ్లను బాగా ఎండ బెట్టి కూడా తినేవారట.
హుంజాస్ ప్రజలు వారానికి కేవలం ఒకసారి మాత్రమే మాంసం తినే వారట. అదీ కొద్దిగానే. వాటిలో ప్రధానంగా చికెన్, చేపలు ఉండేవట. ఆప్రికాట్ గింజలను హుంజాస్ ప్రజలు ఎక్కువగా తినేవారట. అందుకనే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు అసలు వారికి రాలేదట. స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన తాజా గడ్డ పెరుగును వారు తినేవారట. ఇది జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. హుంజాస్ ప్రజల జీవన విధానంలో ప్రధానంగా చెప్పుకోదగింది వ్యాయామం. నిత్యం చేసే శారీరక శ్రమకు తోడు వారు రోజూ దాదాపు 20 కిలోమీటర్ల వరకు నడక సాగించేవారట. ఇదే వారి ఆరోగ్యానికి ప్రధాన రహస్యమట. గోధుమలు, రాగులు, జొన్నల వంటి ధాన్యాలతో చేసిన రొట్టెలను వారు ఎక్కువగా తినేవారట. దీంతోపాటు బాదం పప్పు, జీడిపప్పు వంటి నట్స్, సీడ్స్‌ను కూడా వారు ఎక్కువగా తీసుకునే వారట. ఈ కారణంగానే హుంజాస్ మహిళలు తమ 60వ ఏట కూడా పిల్లలకు జన్మనిచ్చే శక్తిని కలిగి ఉండేవారట. వారు తీసుకునే పదార్థాల్లో విటమిన్ ఇ, ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉండడమే ఆ శక్తికి కారణమని పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.
హుంజాస్ ప్రజలు తమ రోజు వారీ కార్యక్రమాల్లో భాగంగా మెడిటేషన్ కూడా బాగా చేసే వారట. అదే వారిని ఎంతో ఉత్సాహంగా ఉంచేదట. చివరిగా ఇంకో విషయమేమిటంటే, 60 ఏళ్లు వచ్చినా హుంజాస్ ప్రజలు 40 ఏళ్ల వారిలా, 40 ఏళ్ల వారు 20 ఏళ్ల వారిలా ఉండే వారట. అంటే వృద్ధాప్యం కూడా వారికి బాగా ఆలస్యంగా వస్తుందన్నమాట. తెలుసుకున్నారుగా! హుంజాస్ జీవన శైలి గురించి. నచ్చితే మీరు కూడా ఇలా చేసేందుకు ప్రయత్నించండి. దీంతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకవచ్చు. అదేగా మనకు కావల్సింది!