Vadapappu Panakam : దశావతారాలలో ఏడవ అవతారమైన శ్రీ రాముడి జన్మదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా కూడా శ్రీరాముడి కళ్యాణాన్ని అంగరంగవైభవంగా ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ రోజున చేసే వడపప్పు, పానకానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆరోగ్యానికి వడపప్పు, పానకం ఎంతో మంచివని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శ్రీ రాముడికి నైవేథ్యంగా సమర్పించే వడపప్పు, పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వడపప్పు, పానకం తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – పావు కప్పు, బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు , మిరియాల పొడి – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాసు.
వడపప్పు, పానకం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పు నానిన తరువాత నీటిని పారబోసి అర టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి. దీంతో వడపప్పు తయారవుతుంది. వడపప్పు తయారీలో శనగపప్పుకు బదులుగా పెసరపప్పును కూడా వాడవచ్చు.
పానకాన్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్లును పోసి.. అందులో మిగిలిన బెల్లం తురుము, చిటికెడు ఉప్పు వేసి.. బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న నీటిని జల్లి గంట సహాయంతో వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఇలా వడబోసుకున్న నీటిలో మిరియాల పొడి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. దీంతో పానకం తయారవుతుంది. పానకాన్ని ఎక్కువగా తయారు చేయాలకునే వారు ఒక గ్లాసుకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ చొప్పున బెల్లాన్ని వేసుకోవాలి. దీంతో పానకం సరిగ్గా తయారవుతుంది.
ఇక ఆధ్యాత్మిక పరంగానే కాదు.. ఆరోగ్య పరంగా కూడా వడపప్పు, పానకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సీజన్‌లో శనగపప్పును అలా నానబెట్టి తినడం వల్ల చలువ చేస్తుంది. అలాగే పానకం కూడా శరీరానికి మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచి వేసవి తాపం నుంచి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల కేవలం నవమి రోజునే కాదు.. ఈ సీజన్‌లో వడపప్పు, పానకాన్ని తరచూ తీసుకోవడం మంచిది..!